దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ వినియోగిస్తున్న రాష్ట్రం ఏదో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకున్న విషయం తెలిసిందే. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. భారత్‌లో సైతం ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మన దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ వినియోగిస్తున్న రాష్ట్రం ఏది..? అనేది ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. గతంలో ఈ విభాగంలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రను అధిగమించి మరో పెద్ద రాష్ట్రం రికార్డు సృష్టించింది.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన 2024-25 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద పెట్రోల్ వినియోగదారుగా అవతరించింది. ఈ ఆర్థిక రికార్డుల ప్రకారం యూపీలో అత్యధికంగా 4,832.8 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అమ్ముడైంది. విస్తారమైన భౌగోళిక పరిధి, జనాభా పరిమాణంతో పాటు ఇటీవల కాలంలో అక్కడ పెరిగిన సొంత వాహనాలు, మెరుగైన రవాణా సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణాలు.
పెట్రోల్ వినియోగంలో టాప్ రాష్ట్రాలు
గతంలో దేశంలోనే అత్యధిక ఇంధన వినియోగదారుగా రికార్డు సృష్టించిన మహారాష్ట్ర ప్రస్తుతం 4,370.5 వేల మెట్రిక్ టన్నుల వాడకంతో రెండో స్థానంలో నిలిచింది. పారిశ్రామికీకరణ, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా సాగే తర్వాతి స్థానాల్లో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. పీపీఏసీ నివేదిక ప్రకారం తమిళనాడు 3,533.7 వేల మెట్రిక్ టన్నుల వినియోగంతో మూడో స్థానంలో ఉండగా, కర్ణాటక రాష్ట్రం 3,054.3 వేల మెట్రిక్ టన్నులతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన గుజరాత్ 2,701.2 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ వినియోగంతో ఐదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలు కూడా భారీ ఇంధన వినియోగంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత 15 సంవత్సరాల్లో దేశంలో పెరిగిన జనాభా ఆదాయం, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడటంతో ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకాలు పెరిగి ఇంధన కొనుగోళ్లకు ఊతమిచ్చాయి.

ప్రస్తుతం భారత్ లో ప్రతి సంవత్సరం 40 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పెట్రోల్ వినియోగం జరుగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలలో ఒడిదొడుకులు తలెత్తుతున్నప్పటికీ, దేశీయంగా ఇంధన రికార్డులు వేగంగా మారుతున్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రహదారి మౌలిక వసతులు, ప్రయాణ అవసరాల నేపథ్యంలో ఇంధన రంగంలో ఈ డిమాండ్ సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications