ఎన్నికలు సమీపించిన వేళ.. కేంద్రం గుడ్ న్యూస్: అకౌంట్‌లో నిధులు జమ
Lok Sabha elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చిలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సన్నద్ధమౌతోన్నాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ ఇచ్చారు. లబ్దిదారుల ఖాతాల్లో తొలి విడత నిధులను జమ చేశారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేశారు. అనంతరం లబ్దిదారులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకం కింద అర్హులైన లబ్దిదారుల కోసం విడుదల చేసిన నిధులు అవి. ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కింద ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. 2023-2024 వార్షిక బడ్జెట్‌లో దీన్ని చేర్చింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని అమలు చేస్తామనీ అప్పట్లో ప్రకటించింది.
దీనికి అనుగుణంగా గత ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చు 24,104 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 15,336 కోట్ల రూపాయలు. మిగిలిన 8,768 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

అంతరించి పోతున్న గిరిజనులు, ఆదివాసీలకు నివాస వసతిని కల్పించడం, వారు నివసిస్తోన్న ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2011 జనాభా గణాంకాల ప్రకారం 10.45 కోట్ల మంది పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ సహా 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిక ప్రాంతాల్లో వారు నివసిస్తోన్నట్లు గుర్తించింది.
నిధులను విడుదల చేసిన అనంతరం మోదీ గిరిజన మహిళలతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో నివసిస్తోన్న ప్రతి వర్గానికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. గిరిజనులు, ఆదివాసీల పక్కా నివాస కలలను సాకారం చేస్తోన్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications