ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై మోడీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి: వైఎస్ జగన్‌కు ప్రధాని ఫోన్
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు వెలువడిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నటుడు మంచు మనోజ్ ఈ ఘటన దిగ్భ్రాంతిని తెలిపారు.
Recommended Video

11 గంటలకు ఎన్డీఆర్ఎఫ్‌తో ప్రధాని భేటీ
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాస్సేపట్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కొనసాగుతోన్న సహాయక చర్యలపై ప్రధాని ఆరా తీశారు. సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నారు. ఈ నివేదిక సహా, మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధాని.. జాతీయ విపత్తు నిర్వహణ అధికారులతో చర్చించనున్నారు.

జగన్‌కు ఫోన్
పరిస్థితి తీవ్రత తెలుసుకున్న వెంటన ప్రధానమంత్రి.. హుటాహుటిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని ధైర్యం పలికినట్లు సమాచారం. కేంద్రం నుంచి కావాల్సిన సహాయ, సహకారాలను పూర్తిస్థాయిలో అందజేస్తామని, అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను విశాఖకు పంపిస్తామని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని వైఎస్ జగన్.. ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉండాలి..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశించారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ సమయంలో బాధితులకు తమవంతు సహాయ, సహకారాలను అందించాలని అన్నారు. విష వాయువులు లీక్ అయిన సమాచారం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ.. ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మృతుల కుటంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారికి అవసరమైన అండదండలను పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు.

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు, నారా లోకేష్..
విశాఖపట్నం ఉదంతంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాలని, తాము ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. మెరుగైన వైద్యాన్ని అందజేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..
విషవాయువుల వెలువడిన ఉదంతం పట్ల తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. విష వాయువుల ప్రభావానికి లోనైన వారికి ఏపీ ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సను అందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలిపారు.












Click it and Unblock the Notifications