"ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు.. ఆర్థికాభివృద్ధిలో భారత్ మాత్రం తగ్గేదేలే"
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా భారత ఎకానమీ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి 7.8 శాతం వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఘర్షణలు, వాణిజ్య ఒత్తిడి, చమురు, ఎనర్జీ సరఫరాలో అంతరాయం దృష్ట్యా భారత ఆర్థికాభివృద్ధి ఒక కొత్త ఆశను చిగురింపజేసిందని తెలిపారు. ఈ మేరకు ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్- 2026లో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. " ఏప్రిల్- జూన్ త్రైమాసికం సాధారణంగా సవాల్ గా మారింది. కానీ భారత్ శక్తివంతమైన ఆర్థిక ప్రగతి 7.8 శాతం వృద్ధితో ప్రపంచ దేశాల్లో ఆశను నిలిపింది" అని స్పష్టం చేశారు.
ఇక భారత్ కు చెందిన యూపీఐ వ్యవస్థ తీసుకొచ్చి 10 ఏళ్లు అయిన సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో అందుబాటులో ఉందన్నారు. యూపీఐ సేవలు ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానం కావడమే తమ తదుపరి లక్ష్యం కావాలని ఫిన్ టెక్ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత్ లో యూపీఐ సేవలు విజయం సాధించాయని కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ యూపీఐ సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ మేరకు టెక్నాలజీ కారణంగానే ఇది సాధ్యమైందని అన్నారు. సాంకేతికత అందరనీ కలుపుకొని పోవడంలో ప్రధానంగా మారిందని వివరించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ యూపీఐ విధానంపై చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ.. యూపీఐ అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. అది ఒక నాగరికతకు సంబంధించిన అంశం కూడా అని ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్నేళ్లుగా చెల్లింపుల రంగంలో సాధించిన అద్భుత విజయాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. అలాగే ఫిన్ టెక్ రంగం కేవలం డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకూడదని.. రుణాలు, పొదుపులు, పెన్షన్లు, బీమా వంటి రంగాల్లోనూ ఫిన్ టెక్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఫిన్ టెక్ రంగం గణనీయంగా విస్తరించిందని అందువల్ల కోట్లాది మంది ప్రజలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications
