హర్యానా ఎన్నికల కోసమే జైలు నుంచి ఆ ఇద్దరి రిలీజ్-బీజేపీపై రాబర్ట్ వాద్రా షాకింగ్..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో అధికారం నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో బీజేపీ నేతలు కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. దీనికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ నేతలు కూడా కొత్త కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డేరా సచ్ఛా సౌధా ఛీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తో పాటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తాజాగా జైలు నుంచి పెరోల్, బెయిల్ పై విడుదల కావడాన్ని ప్రస్తావిస్తూ రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ హర్యానా ఎన్నికల కోసమే వీరిద్దరినీ జైలు నుంచి విడిపించిందంటూ రాబర్ట్ సంచలన ఆరోపణలు చేశారు.

రేప్, మర్డర్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న రామ్ రహీమ్ సింగ్ ను హర్యానా ఎన్నికల్లో ప్రభావం చూపడం కోసమే పెరోల్ పై బీజేపీ బయటికి తెచ్చిందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ను సైతం హర్యానాలో కాంగ్రెస్ అవకాశాల్ని దెబ్బతీసేందుకే బెయిల్ పై బయటికి తెచ్చిందంటూ రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలవుతున్న సమయాల్ని రాబర్ట్ వాద్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications