• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రొఫెసర్ శాంతమ్మ

ప్రొఫెసర్ శాంతమ్మ 1951లో ఆంధ్రా యూనివర్సీటిలో భౌతికశాస్త్ర అధ్యాపకురాలిగా చేరారు. అప్పటి నుంచి గత 71 ఏళ్లుగా ఫిజిక్స్ పాఠాలను బోధిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శాంతమ్మ వయసు 94 ఏళ్లు. ఈ వయసులో రిసెర్చ్ చేస్తూ, భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై రెండు పుస్తకాలు రాస్తున్నారు. పైగా రోజుకు రాను, పోను 130 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

'యూనివర్సీటికి వెళుతుంటే ఆసుపత్రికి అనుకుంటారు'

ప్రొఫెసర్ శాంతమ్మ విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు.

1929లో పుట్టిన శాంతమ్మకు చిన్నతనం నుంచి సైన్స్ అంటే ఆసక్తి. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్స్ లో పట్టు సాధించారు.

1951లో ఆంధ్రా యూనివర్సీటీలో భౌతికశాస్ర విభాగంలో అధ్యాపకురాలిగా చేరారు. 1956లో ఆమె ఉద్యోగం రెగ్యులరైజ్ అయ్యింది.

1989లో పదవి విరమణ పొందారు. అయినప్పటికీ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. మళ్లీ ఏయూలోనే గౌరవ అధ్యాపకురాలిగా సేవలను అందించారు.

గత ఐదేళ్లుగా విజయనగరంలోని సెంచురియన్ యూనివర్సీటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

"నేను రోజూ విశాఖపట్నం నుంచి విజయనగరంలోని వర్సిటీకి రానుపోను 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. నా అనుభవాన్ని అంతా ఈ తరం పిల్లలకు చెప్పాలని కోరుకుంటున్నాను. అందుకే వయసుతో సంబంధం లేకుండా నేను ఇంత వ్యయ ప్రయాసలకు లోనైనా కూడా పాఠాలు చెప్పడం మానను. నేను ఫిజిక్స్ లోని జామెట్రీ అప్టిక్స్, ఫిజికల్ అప్టిక్స్ బోధిస్తాను. నన్ను చూసిన కొత్త వారేవరైనా నేను రోజూ యూనివర్సిటీకి బయలుదేరి వస్తుంటే, నా వయసు రీత్యా ఆసుపత్రికేమో అని అనుకుంటారు" అని నవ్వుతూ చెప్పారు ప్రొఫెసర్ శాంతమ్మ.

ప్రొఫెసర్ శాంతమ్మ

'మొదటి రోజు నేను ఆశ్చర్యపోయాను'

ప్రొఫెసర్ శాంతమ్మ విద్యాభ్యాసమంతా విశాఖలోనే సాగింది. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అధ్యాపకురాలిగా చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ శాంతమ్మ బోధన, పరిశోధన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.

94 ఏళ్ల వయసులో కూడా స్టూడెండ్స్ ను ఎంగేజ్ చేస్తూ పాఠాలు చెప్పడం ప్రొఫెసర్ శాంతమ్మ స్పెషల్ అని అంటుంటారు.

ఆమె పాఠాలు వింటున్న విద్యార్థులు ఇదే మాట చెబుతారు. ప్రొఫెసర్ శాంతమ్మతో ఇంటరాక్షన్ షెషన్స్ చాలా సరదాగా ఉంటాయని బీఎస్సీ ఆప్టోమెట్రీ చదువుతున్న సోని బీబీసీతో చెప్పారు.

"మొదటి రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంత పెద్ద వయసు ప్రొఫెసర్ మాకు పాఠాలు చెబుతారా అని మా స్టూడెంట్స్ అంతా మాట్లాడుకున్నాం. ఈ వయసులో మేడం పాఠాలు చెప్పడం ఏంటి? పైగా జామెట్రీ అప్టిక్స్, ఫిజికల్ అప్టిక్స్ చెప్తారని తెలిసి మరింత ఆశ్చర్యం వేసింది. రెండు, మూడు రోజుల్లోనే ఆవిడ చాలా బాగా అలవాటైపోయారు. పైగా చాలా అనుభవం ఉండటం వలన మాకు ఎలా చెబితే అర్థమవుతుందో అలాగే చెబుతారు".

"ప్రొఫెసర్ శాంతమ్మతో సరదాగా కూర్చుని మాట్లాడితే భలే టైమ్ పాస్ అవుతుంది. విషయం చెబుతూనే బోలెడన్ని జోక్స్ వేస్తారు. మేడం చిన్న డౌట్ అంటే, ఫిజిక్స్ లో చిన్నవి కాదు, పెద్ద డౌట్సే రావాలి అంటారు" అని సోని బీబీసీతో చెప్పారు.

"అన్నింటికి మించి క్లాసులోకి వచ్చిన తర్వాత ఎక్కువ సేపు బోర్డు దగ్గర నిలబడి రకరకాలైన అప్టిక్స్ స్ట్రక్చర్స్ గీస్తూ పాఠాలు చెప్తారు. చాక్ పీసుతో చకచక బోర్డుపై డ్రాయింగ్ గీసేస్తూ చెప్తూంటే చాలా సార్లు మేం ఆశ్చర్యపోతూ ఉంటాం" అని సోని అన్నారు.

ప్రొఫెసర్ శాంతమ్మ

'పరిశోధన ఆపలేదు, రెండు పుస్తకాలు రాస్తున్నా'

ప్రొఫెసర్ శాంతమ్మ ఏయూలో అనేక మంది పరిశోధకులకు గైడ్ గా వ్యవహరించారు. అలాగే ఆమె ఆధ్వర్యంలోనే కొందరు ఎంఫిల్ పట్టాలు పొందారు. మరోవైపు శాంతమ్మ కూడా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక వర్శిటీలకు ఈ వయసులో కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉండాలని శాంతమ్మ అన్నారు.

"17 మందికి నేను ఫిజిక్స్ పరిశోధనల్లో గైడ్‌గా వ్యవహరించాను. అలాగే నలుగురు ఎంఫిల్ పట్టాలు కూడా పొందారు".

''నేను కూడా ఇంకా భౌతిక శాస్రంలోని కొత్త అంశాలపై పరిశోధనలు చేస్తున్నాను. మరో రెండేళ్లలో అవి పూర్తవుతాయని అనుకుంటున్నాను. వాటిని పుస్తకాలుగా తీసుకుని వస్తాను. ఇప్పటికే ఫిజిక్స్ లో అనేక ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ రాశాను. ఇంకా నేను రాయవలసినవి, నా విద్యార్థులకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. నేను నా పనిని ఎక్కడా ఆపదల్చుకోలేదు. జ్ఞాన సముపార్జన నిరంతరం కొనసాగాలి. నేను ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉండటానికి అదే కారణమని అనుకుంటున్నాను" అని ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో చెప్పారు.

ప్రొఫెసర్ శాంతమ్మ పని చేస్తున్న సెంచూరియన్ వర్సీటి వీసీ జీఎస్ఎన్ రాజు కూడా 50ఏళ్ల క్రితం ఏయూలో ఆమె శిష్యుల్లో ఒకరు. తన గురువుగారైన ప్రొఫెసర్ శాంతమ్మ ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీతో ఇంజనీరింగ్, సైన్స్ బోధించడం చాలా మందికి ఆదర్శమని వీసీ చెప్పారు.

జీఎస్ఎన్ రాజు

'ఆమె చెప్పిన పాఠాలే నన్ను ఈ స్థితిలో నిలబెట్టాయి'

''మా గురువు శాంతమ్మ బ్రిటన్ రాయల్ సొసైటీలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో రిసెర్చ్ చేసి లాబోరేటరీలను డెవలప్ చేశారు’’ అని సెంచురియన్ యూనివర్సీటి వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు బీబీసీతో చెప్పారు.

"ప్రొఫెసర్ శాంతమ్మకి పరిశోధనలంటే ఇప్పటికీ ఎంతో అభిలాష. ఇప్పటికే లేజర్ టెక్నాలజీ, పెట్రోల్‌ ఇంప్యూరిటీస్ వంటి ప్రాజెక్టుల్లో రిసెర్చ్ చేశారు. నేను కూడా ఆమె శిష్యుడ్నే. ఆమె చెప్పిన పాఠాలు వినే ఈ స్థాయికి వచ్చాను".

"సుమారు 50 సంవత్సరాల క్రితం మాకు ఫిజిక్స్ పాఠాలు చెప్పారు. మేడంకు నేను ప్రియ శిష్యుడ్ని. ఏయూ వీసీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ వర్సిటీలో మా గురువు పాఠాలు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా పాఠాలు చెప్పేందుకు అంత దూరం నుంచి రావడం, ఏ రోజు కూడా లీవ్ పెట్టకపోవడం టీచింగ్ పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను చెబుతాయి" అని జీఎస్ఎన్ రాజు అన్నారు.

ప్రొఫెసర్ శాంతమ్మ

'వేదగణితంలోనూ ప్రతిభ'

రిటైరైన 34 ఏళ్ల తర్వాత కూడా శాంతమ్మ బోధన, పరిశోధన కొనసాగుతూనే ఉన్నాయి. ఫిజిక్స్ లో మాత్రమే కాకుండా వేద గణితంలోనూ ఆమె ప్రతిభ కనపరిచారు.

వేద గణితంలోని 29 సూత్రాలపై పరిశోధనలు చేశారు. ప్రతి ఒక్కరు సమయాన్ని, శక్తిని గౌరవించాలని...ఈ రెండిటిని వృథా చేయకూడదని ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో చెప్పారు.

పిల్లలు లేరు

"నా భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. నా భర్త తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో ఆయన ద్వారా పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై పట్టు దొరికింది. చివరి శ్వాస వరకు బోధన చేస్తుండాలనేది నా లక్ష్యం.

మాకు విశాఖలో ఉన్న ఖరీదైన స్థలాన్ని ఒక ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చేశాం. ప్రస్తుతం తెలిసిన వారితో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాను. రోజూ పొద్దున్న 4 గంటలకే నిద్రలేచి నా పనులను నేనే స్వయంగా చేసుకుంటాను. యనివర్సిటీలో వారానికి 4 నుంచి 6 తరగతులు బోధిస్తాను. సెలవు రోజు కూడా అవసరమైతే పాఠాలు చెప్పడానికి వస్తాను. ఎందుకంటే పిల్లలతో గడుపుతూ మా జ్ఞానాన్ని పంచితే ఈ తరం పిల్లలు ఎన్నో అద్భుతాలు చేస్తారు" అని శాంతమ్మ చెప్పారు.

ప్రొఫెసర్ శాంతమ్మ

'సమయం, శక్తిని గౌరవించాలి'

"నాకు ఇప్పుడు 94 ఏళ్లు. మా అమ్మ కూడా 104 ఏళ్లు జీవించారు. నేను మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. లేనిపోని ఆర్భాటాలకు అవకాశం ఇవ్వను. నిరంతరం ఏదో కొత్త విషయం తెలుసుకునేందుకే ప్రయత్నిస్తుంటాను.

ఇప్పటికీ నాకు షుగర్, బీపీ వంటివి లేవు. టైమ్‌ని, ఎనర్జీని సమన్వయపర్చుకుంటూ ఇష్టమైన పనిని చేయడమే ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమని నేను అనుకుంటున్నాను" అని ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో అన్నారు.

"మనలో చాలా మంది ఉన్న సమయాన్ని చాలా విషయాలపై కేంద్రీకరిస్తాం. కానీ అది సరైనది కాదు. ఏదో ఒక విషయంపై దృష్టి పెట్టాలి. అలాగే మనలో ఉన్న ఎనర్జీని కావలసిన విషయాలకే వాడాలి. కాబట్టి ఏది మనకు అవసరమో, ముఖ్యంగా ఏది మనకు ఇష్టమైన పనో, అదే చేయాలి. అది కూడా మన శక్తి సామర్థ్యాలను లెక్క వేసుకుని చేయాలి. మనం చేసే పని మనతో పాటు ఇతరులకి ఉపయోగపడాలి. అలాంటి పనులపైనే మన సమయం, శక్తిని వినియోగించాలి" అని ప్రొఫెసర్ శాంతమ్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Professor Santhamma: 94-year-old grandmother who travels 130 km to teach physics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X