'3 ఏళ్ల ఫీజు తిరిగి ఇచ్చేయండి'.. ప్రైవేట్ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పెంపు అంశంపై వివాదాలు కొనసాగుతున్న వేళ సంచలన ప్రకటన చేసింది. ప్రైవేట్ స్కూల్స్ సంవత్సరానికి ఐదు శాతం ఫీజులు పెంచుతున్న క్రమంలో గత మూడేళ్లుగా పెంచిన ఫీజును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ విద్యాసంస్థలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
" గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలలు అయితే 15 శాతం కంటే అధికంగా వసూలు చేసినవో ఆ పాఠశాలలు అధికంగా వసూలు చేసిన ఫీజును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయాలి. ఉదాహరణకు ఒక పాఠశాల మూడేళ్లలో ఫీజును 25 శాతం పెంచితే వాళ్లు తమ ఫీజులో ఎక్స్ ట్రాగా వసూలు చేసిన 10 శాతం ఫీజును వాపసు ఇవ్వాలి" అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు నియంత్రణపై మాట్లాడారు. పైవేట్ విద్యాసంస్థల్లో ఫీజును నియంత్రించేందుకు తక్షణమే ఆర్డినెన్స్ ను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ ఖటారియా.. 'పంజాబ్ రెగ్యూలేషన్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్ ఎయిడెడ్ ఎడ్యూకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఆర్డినెన్స్-2026' కు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ బిల్లును కేబినెట్ గత నెలలోనే క్లియర్ చేసిందన్నారు. ఫీజుల పెంపుపై డిప్యూటీ కమిషనర్స్ అధ్యక్షతన రెగ్యూలేటరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎడ్యూకేషన్ మాఫియాను నిర్మూలిస్తామని తెలిపారు. ఇప్పటికే తాము రాష్ట్రంలో అనేక రకాల మాఫియాలను తొలగించామని.. మరొకటి రావాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మకమైన నిర్ణయం అని.. ప్రైవేట్ విద్యా సంస్థలపై అధిక ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం పంజాబ్ అని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications