ట్రంప్ తో గొడవల వేళ.. భారత పర్యటనకు పుతిన్
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అనంతరం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. త్వరలోనే ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పుతిన్ పర్యటన ఖచ్చితంగా ఉండబోతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు నెలల్లోనే ఆయన భారత్ కు వస్తారనీ చెబుతున్నాయి.
పుతిన్.. భారత పర్యటనను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన రష్యా పర్యటనలో ఉన్నారు. మాస్కోలో పర్యటిస్తోన్నారు. ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. తన భారత పర్యటన సందర్భంగా పుతిన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications