ఆ కేంద్రమంత్రిపై గన్ ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ- ఓపెన్ లెటర్: లోక్ సభలో వీటిపైనే.. !!
ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల దాడి దేశవ్యాప్తంగా ఆందోళనలకు గురి చేసింది. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పూర్తి బాధ్యత వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం తీసుకోవాలని అన్నారు. వారిపై విచక్షణారహితంగా పోలీసులతో దాడి చేయించడం శ్రేయస్కరం కాదని, దీనిపై మౌనం వీడాలని చెప్పారు.
ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కొద్దిసేపటి కిందటే రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారాయన. దేశంలో జవాబుదారీతనంతో కూడిన విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలన్న విద్యార్థుల ఆవేదనను ఆలకించి, దాన్ని పరిష్కరించడానికి బదులుగా పోలీసులు, కేంద్ర భద్రత బలగాలతో దాడి చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా, ప్రాణాంతక ఆయుధాలను కూడా ఉపయోగించారని ఆరోపణలు చేశారు.

పోలీస్ చర్యలో వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని రాహుల్ గాంధీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాణాంతక పెల్లెట్ గన్లను ఉపయోగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఘర్షణల వల్ల అనేక మంది యువత తీవ్ర గాయాలపాలయ్యారని, వారిలో ఒక జర్నలిస్టు కూడా ఉన్నాడని గుర్తుచేశారు. తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్‌ను తాను వ్యక్తిగతంగా కలిశానని రాహుల్ గాంధీ లేఖలో వెల్లడించారు.
పెల్లెట్ బుల్లెట్లు తగలడం వల్ల ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర వేదన అనుభవిస్తున్నాడని, ఒక కన్ను కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని పేర్కొన్నారు. దీనితో పాటు నిరసనల్లో పాల్గొన్న మహిళా విద్యార్థులపై పురుష పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, వారిపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారని అన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే భద్రతా బలగాలు నేరుగా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయని, అందువల్ల హోంమంత్రిగా అమిత్ షా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలను సంధించారు. మొదటిది.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లు, ప్రాణాంతక బలప్రయోగానికి హోమ్ మంత్రిగా అనుమతి ఇచ్చారా?.. కాకపోతే దీన్ని అనుమతించిన అధికారి ఎవరనేది తెలియజేయాలని అన్నారు.
రెండోది.. ఆందోళనల సమయంలో మఫ్టీలో ఉంటూ విద్యార్థులపై లాఠీలతో దాడి చేసిన వ్యక్తులు ఎవరని, వారు పోలీసు సిబ్బందా లేక ప్రైవేట్ వలంటీర్లా, అసలు వారిని అక్కడ మోహరించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు.. అనే విషయాలను స్పష్టం చేయాలని అమిత్ షాను కోరారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య నియమాలను పూర్తిగా తుంగలో తొక్కడమేనని రాహుల్ గాంధీ విమర్శించారు.
छात्रों को मारने का आदेश किसने दिया? pic.twitter.com/NDwfka1UqO
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2026
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని రాహుల్ గాంధీ, వారిని రక్షించడం, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తుచేశారు. ఈ చర్యలు దేశ ప్రతిష్టను దిగజార్చాయని, వారిని భయపెట్టడం ద్వారా యువత గొంతును అణచివేయలేరని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తగిన జవాబులు లభించేవరకు విద్యార్థుల తరఫున పోరాటం సాగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications