పాకిస్తాన్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన కేంద్రం: దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం
నేడు.. కార్గిల్ విజయ్ దివస్. ఈ సందర్భంగా ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుతూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారక వర్చువల్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తలపెట్టే ఏ శక్తినైనా దీటుగా ఎదుర్కొనడానికి ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
ద్రాస్ వేదికగా పొరుగు దేశం పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న శక్తులకు బుద్ధి చెప్పే శక్తి సామర్థ్యాలు తమ సైన్యానికి ఉన్నాయని అన్నారు. భవిష్యత్ లో ఆ దేశంతో చర్చలు జరపాల్సి వస్తే.. అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనే ఉంటాయని తేల్చి చెప్పారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, దానిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తన ప్రభుత్వ విధానంగా మార్చుకుందని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. భారత్ నూతన ఆవిష్కరణలు, అంతరిక్ష ప్రయోగాలు, సెమీకండక్టర్ల తయారీ, యూపీఐ వంటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థల వైపు దూసుకుపోతుంటే, పాక్ మాత్రం చొరబాట్లు, మానవబాంబులు, హవాలా వ్యవస్థలపైనే ఆధారపడుతోందని ఎద్దేవా చేశారాయన. భారత్ ప్రపంచానికి మెరుగైన సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తుంటే, పొరుగు దేశం మాత్రం ఉగ్రవాదాన్ని మాత్రమే సరఫరా చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.
రక్షణ రంగంలో సాధించిన స్వావలంబనను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకప్పుడు 65 నుంచి 70 శాతం రక్షణ పరికరాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేదని, కానీ నేడు 65 శాతానికి పైగా రక్షణ రంగ పరికరాలను ఇక్కడే తయారు చేసుకుంటున్నామని తెలిపారు. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా చెప్పిన యే దిల్ మాంగే మోర్.. అనే మాటను గుర్తు చేస్తూ, అత్యాధునిక ఆయుధాల తయారీలో ఇక్కడితో ఆగిపోబోమని, మరిన్ని అధునాతన సాంకేతికతలను సొంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ వాయు రక్షణ నియంత్రణ వ్యవస్థ, నెక్స్ట్ జెన్ ఆకాశ్ క్షిపణి, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, గగనతల క్షిపణులు, ప్రచండ్, ధ్రువ్ వంటి స్వదేశీ హెలికాప్టర్లు, తేజస్ యుద్ధ విమానం, అర్జున్ ట్యాంక్, ఆధునిక డ్రోన్, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలతో రక్షణ వ్యవస్థ విలసిల్లుతోందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా భారత నౌకాదళంలో చేరిందని గుర్తు చేశారు. మరిన్ని అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, క్షిపణులను అభివృద్ధి చేస్తామని అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో సైన్యం వద్ద తిరుగులేని నైపుణ్యం ఉన్నప్పటికీ, పాలకులలో చిత్తశుద్ధి కొరవడిందని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. తమ ప్రభుత్వం సైనికుల సంక్షేమానికి, దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నేడు రక్షణ రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోన్నామని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని గుర్తు చేశారు. సరైన నాయకత్వంతో దేశాన్ని మరింత సురక్షితంగా మారుస్తున్నామని ఆయన అన్నారు.
సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న వీర సైనికులు ఉన్నంత కాలం భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఏ శత్రు దేశానికి లేదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రతిష్టను పెంచిన కార్గిల్ యుద్ధ స్మారక స్థలంలో దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వీరుల పేర్లు ఉన్నాయని, దేశాన్ని విడదీయాలని చూసే శక్తులకు ఈ ఐక్యత ఓ గట్టి సమాధానమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications