దెబ్బకి ఢమాల్: జియో ఫోన్ బుకింగ్స్ కు అనూహ్య స్పందన, నిమిషానికే వెబ్ సైట్ క్రాష్
గురువారం జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ ప్రారంభం కాగా ఒక్కసారిగా లక్షలాదిమంది వినియోగదారులు ఫోన్ బుకింగ్స్ కోసం ప్రయత్నించేటప్పటికీ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దీంతో వినియోగదారులు అసంతృప్తికి గురయ్యారు.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది రిలయన్స్ 'జియో'. గురువారం సాయంత్రం 5.30 గంటలకు జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఒక్కసారిగా లక్షలాదిమంది వినియోగదారులు ఫోన్ బుకింగ్స్ కోసం ప్రయత్నించేటప్పటికీ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దీంతో వినియోగదారులు అసంతృప్తికి గురయ్యారు. జియో.కామ్ ఓపెన్ చేయగానే కంటెంట్ సర్వర్ ఎర్రర్ అని వచ్చింది. కొంతమంది యూజర్లు జియో.కామ్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. అసలేమీ కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

దాదాపు 50 కోట్ల మంది యూజర్లు జియో ఫోన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెబ్‌సైట్ క్రాష్ అవడంపై నెటిజన్లు ట్విటర్ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'జియో ఫోన్ బుకింగ్స్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేసిన నిమిషానికే సర్వర్ ఎర్రర్ అని చూపించింది'. 'ఫోన్ కొనుగోలుకు ఎటువంటి లింక్ చూపించలేదు'. 'మై జియో యాప్ కూడా జియో ఫోన్ బుకింగ్స్ చూపడం లేదు' అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫ్రీ ఫోన్ అయినా దీనికోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే.. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించింది.












Click it and Unblock the Notifications