పెంపుడు కుక్కతో పార్లమెంట్ కు రేణుక: ఇది కరవదు- కరిచేవాళ్లు లోపల చాలామంది ఉన్నారు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజున తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఏకంగా తన పెంపుడు కుక్కను వాహనంలో తీసుకుని పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ఆమెతో పాటు కారులో పెంపుడు శునకం ఉండటం కనిపించింద. ఈ ఘటన చర్చనీయాంశమైంది. నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే వాదనలు వినిపిస్తోన్నాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పెంపుడు కుక్కతో పార్లమెంట్ కు రావడాన్ని చూసిన కొందరు మీడియా ప్రతినిధులు రేణుకా చౌదరితో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. తేలిగ్గా తీసుకున్నారు. ఇందులో ఎవరికి ఏ ఇబ్బంది ఉందని కొట్టిపారేశారు. పెంపుడు కుక్కతో పార్లమెంట్ కు రావడంతో ఏముంది ఇబ్బందని మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. ప్రభుత్వానికి జంతువులంటే ఇష్టం లేదని అన్నారు.

ఇది మూగ జంతువు. లోపలికి వస్తే ఇబ్బంది ఏముంది. ఇది చిన్న విషయమే కదా. పైగా ఇది కరిచేది కూడా కాదు. కారులోనే ఉంది. కరిచేవాళ్లు పార్లమెంట్ లో ఎందరో ఉన్నారు.." అని రేణుకా చౌదరి బదులిచ్చారు. ఈ విషయంలో బీజేపీకి చెందిన ఎంపీ జగదంబికా పాల్ తీవ్రంగా స్పందించారు. ఎంపీలకు ఉన్న ప్రత్యేక హక్కులు దుర్వినియోగం కాకూడదని తేల్చి చెప్పారు. రేణుకా చౌదరిపై పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు అనేవి దేశ విధి విధానాలు, చట్టాలపై చర్చించడానికి ఓ అత్యున్నత వేదిక అని, అక్కడికి కుక్కను తీసుకురావడం అనేది తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. కరిచేవాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యలు చేయడం యావత్ దేశానికే సిగ్గుచేటు అని జగదంబికా పాల్ అన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సమున్నత పార్లమెంట్ ను అవమానించడమేనని చెప్పారు. రేణుకా చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications