జ్యోతి దర్శనం- సర్వపాప హరణం: టైమ్ ఇదే
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాది మంది దర్శించుకుంటోన్నారు. భక్తిశ్రద్ధలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. మకరవిళక్కు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. మకర జ్యోతిని చూడటానికి బారులు తీరుతున్నారు.
కిందటి నెల 30వ తేదీన మకరవిళక్కు పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆలయం తలుపులు మూతపడనున్నాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నేడు వేలాదిమంది భక్తులు మకర జ్యోతిని దర్శించుకోనున్నారు.

దీనికోసం ఇప్పటికే వేలాదిమంది సన్నిధానానికి చేరుకుంటోన్నారు. ఈ ఉదయం 9 గంటల వరకు 27,949 మంది అయ్యప్ప స్వాములు సన్నిధానాన్ని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు తెలియజేసింది. ఈ సాయంత్రానికి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించింది.
ఈ సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య మకర జ్యోతి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. సన్నిధానానికి ఈశాన్య దిశలో గల పర్వత శిఖరంపై మకరజ్యోతి దర్శనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని దర్శించుకున్న వారి సర్వపాపాలు, దారిద్ర్య దుఖాలు హరించుపోతాయనేది కోట్లాదిమంది భక్తుల విశ్వాసం.
మకరజ్యోతి దర్శనానికి ముందు తిరువాభరణాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. పండళం రాజవంశం నుంచి తిరువాభరణాలను తీసుకుని వస్తారు. వాటిని అయ్యప్పస్వామికి అలంకరిస్తారు. దీని తరువాత మకర జ్యోతి దర్శనం ఇస్తుంది.
మండలం పూజలు ముగిసే సమయంలోనూ ఆభరణాల ఊరేగింపు జరిగింది. పథనంథిట్టలోని ఆరన్ములలో గల ప్రఖ్యాత శ్రీ పార్థసారథి ఆలయం నుంచి బంగారు నగరాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి అయ్యప్ప స్వామికి ధరింపజేశారు. మండలం పూజ ముగియడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది. దీన్ని థంక అంకిగా పిలుస్తారు.
తొలి రోజున రక్తకందస్వామి ఆలయం, రెండో రోజున కొణ్ణి మురింగమంగళం శ్రీ మహాదేవ దేవస్థానం, మూడో రోజు రణ్ణి పెరునాడ్‌లోని శ్రీ ధర్మశాస్త ఆలయంలో ఆగుతుంది. నాలుగో రోజున నీలక్కల్ శివాలయం, పంపాలోని గణపతి దేవాలయంలో పూజలను నిర్వహిస్తారు. అనంతరం సన్నిధానానికి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications