ఆప్ కు భారీ ఎదురుదెబ్బ.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
దేశ రాజధాని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దిల్లీ జల్ బోర్డు STP టెండర్ స్కామ్ లో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. దిల్లీ జల్ బోర్డులో అవినీతికి సంబంధించి గతంలో నమోదైన కేసులో భాగంగా జైన్, బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాశ్ రాయ్ తో పాటు ఆరుగురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆప్ సర్కార్ సమయంలో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ల ఆధునికీకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2024 లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఇక మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ ఆధునీకరణ అలాగే సామర్థ్యం విస్తరణ కోసం జారీ చేసిన టెండర్లలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. యూరో టెక్ ఎన్విరాన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్ లో సాంకేతిక నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపాదిత పైలట్ పూర్తి స్టడీని నిర్వహించకుండానే ఇతర కంపెనీల నుంచి పోటీని తొలగిస్తూ పలు నిబంధనల్ని మార్చినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఏసీబీ తెలిపింది.

మరోవైపు సత్యేందర్ జైన్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించింది. గతంలోనూ మనీలాండరింగ్ ఆరోపణలతో తప్పుడు కేసు పెట్టి సత్యేందర్ జైన్ ను అరెస్టు చేశారని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ అరెస్టు చేసి వేధిస్తున్నారని వివరించింది. ఇదే అంశంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నియంతృత్వ పాలన ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు. జైలు పాలై, మానసిక వేదన అనుభవించిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications