కీలక పరిణామం: రాజ్యాంగ ధర్మసనానికి ఆర్టికల్ 370, అక్టోబర్‌లో సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సహా కాశ్మీర్ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ అంశాలకు సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.

ఇక కీలక పరిణామం ఏమంటే.. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రానికి నోటీసులు
దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, జమ్మూకాశ్మీర్ అంశంలో ఓ మధ్యవర్తిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ప్రతి పౌరుడికి కాశ్మీర్ వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో మీడియా ఆంక్షలు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత లాంటి అంశాలపై మరో వారం రోజుల్లో అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఏం చేయాలో తెలుసు
కాశ్మీర్ విషయంలో తమకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం వాదించగా.. 'ఏం చేయాలో మాకు తెలుసు. మేము ఆదేశాలు ఇచ్చాం. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండబోదు' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ కే కే వేణుగోపాలు, సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications