మోడీని కదలించిన బాలిక: ఒక్క లేఖ.. ఆ గ్రామాన్ని మార్చేయబోతుంది!
గ్రామంలో నెలకొన్న సమస్యలకు ఎలాగైనా ఓ పరిష్కార మార్గం వెతకాలన్న ఆలోచన నమన అనే ఓ పదహారేళ్ల బాలిక మదిలో మొదలైంది.
చిక్‌మంగళూరు: జిల్లాకు 45కి.మీ దూరంలో ఉన్న ఆ ఊరి గురించి అక్కడి అధికారులెవరూ ఇంతవరకు పట్టించుకోలేదు. గ్రామంలో 35కుటుంబాలు నివసిస్తున్నా.. ఇంతవరకు కనీస అవసరాలకు నోచుకోని గ్రామమది. రోడ్డు లేదు.. పాఠశాల భవనం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సమస్యలే.
కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో గల ముదిగర్ తాలుకాలోని అలేఖాన్ హోరట్టి గ్రామ దుస్థితి ఇది. గ్రామంలో నెలకొన్న సమస్యలకు ఎలాగైనా ఓ పరిష్కార మార్గం వెతకాలన్న ఆలోచన నమన అనే ఓ పదహారేళ్ల బాలిక మదిలో మొదలైంది. ఎలాగైనా తమ గ్రామాన్ని ప్రగతి బాట పట్టించాలని నిర్ణయించుకుంది. గ్రామ సమస్యలు ఏకరువు పెడుతూ ఇందుకోసం ఏకంగా ప్రధాని మోడీకి ఆ బాలిక లేఖ రాసింది.
బాలిక చదువుకునే బిద్దర్ లోని మొరార్జీ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఇందుకోసం ఆమెను ప్రోత్సహించారు. అనుకున్నట్టుగానే అక్టోబర్ 6న గ్రామ సమస్యలపై ప్రధాని మోడీకి లేఖ రాసింది. అయితే లేఖ రాసి రెండు నెలలు అయిపోయినా.. పీఎంవో కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. నమన ఇక తన ఆశలు వదిలేసుకుంది.

ఇలాంటి తరుణంలో గత సోమవారం నుంచి అధికారులంతా ఆ గ్రామానికి క్యూ కట్టడం అక్కడి ప్రజల్లో సంతోషం వ్యక్తమయ్యేలా చేసింది. బాలిక లేఖపై స్పందించిన పీఎంవో కార్యాలయం.. అక్కడి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కర్ణాటక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో అధికారుల సందడి నెలకొంది. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటంతో గ్రామస్తులంతా నమనను అభినందిస్తున్నారు.
ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన అలేఖాన్ హోరట్టి గ్రామం.. మొత్తానికి నమన రాసిన లేఖతో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టనుంది.












Click it and Unblock the Notifications