పాక్ బిగ్ స్కెచ్.. జై శంకర్‌కు భారీ ముప్పు.. బుల్లెట్ ప్రూఫ్ కారుతో సెక్యూరిటీ పెంపు
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ కు సెక్యూరిటీని భారీగా పెంచినట్లు సమాచారం. దిల్లీలోని ఆయన ఇంటి చుట్టూ భద్రతా బలగాలను భారీగా మోహరించినట్లు తెలుస్తోంది. అంతేకాక బుల్లెట్‌ప్రూఫ్ కారుతో భద్రత కల్పించినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే విదేశాంగ మంత్రి హోదాలో జై శంకర్ కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో ఫుల్ సెక్యూరిటీ ఉంది. ప్రస్తుతం ఆయనకు జడ్-కేటగిరీ భద్రత కొనసాగుతోంది. అంటే 33 మంది కమాండోలు ఒక టీమ్ గా ఏర్పడి నిరంతరం ఆయనకు రక్షణ వలయంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జై శంకర్ కు ఈ భద్రతతో పాటు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే భారత్- పాకిస్థాన్ యుద్ధం కారణంగా విదేశాంగ మంత్రి జై శంకర్ కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు.. నివాసం చుట్టూ ఫుల్ సెక్యూరిటీ విధించినట్లు అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ లో జై శంకర్ కు ఉన్న వై కేటగిరీ భద్రతను జడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు దిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారికి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభు్త్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతడ్ని 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications