"అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాలి"
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు ట్రంప్. ఈ మేరకు ఈ ఆర్డర్ పై సంతకం చేశారు. అంతేకాక త్వరలో భారత్ పై సెకండరీ శాంక్షన్స్ విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్- రష్యా మధ్య మూడేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంపై భారత్ ఎలాంటి వైఖరి ప్రకటించకపోవడంతో పాటు పుతిన్ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్ పై కన్నేసిన ట్రంప్.. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భారత్ ను నిలువరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికాతో భారత్ కు 90 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉందని.. అమెరికా నిర్ణయంతో భారత్ వస్తువులపై ధరలు పెరిగితే ప్రజలు కొనుగోలు చేసేముందు ఆలోచిస్తారని తెలిపారు. మరోవైపు వియత్నాం, ఇండోనేషియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా దేశాల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయని ప్రజలు ఆ వస్తువులను కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల భారత్ సైతం అమెరికా వస్తువులపై 50 శాతం టారిఫ్ లు విధించాలన్నారు. ప్రస్తుతం అమెరికా వస్తువులపై 17 శాతం టారిఫ్ లు విధిస్తున్నామని తెలిపారు.

" భారత్ పై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తోంది. భారత్ లో అమెరికా వస్తువులపై 17 శాతం టారిఫ్ విధిస్తున్నాం. కానీ అమెరికా.. భారత్ వస్తువులపై 50 శాతం టారిఫ్ లు విధిస్తోంది. దీంతో భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ లు విధించాలి. వాళ్లు 50 శాతం విధిస్తుంటే.. మనం 17 శాతం మాత్రమే ఎందుకు విధించాలి. మనం వారికి ముఖ్యం కానప్పుడు.. మనకూ వాళ్లు ముఖ్యం కాదు" అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.
రష్యా నుంచి భారత్.. చమురు ఉత్పత్తులు, ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే కారణంగా ఈ టారిఫ్ లు విధిస్తోంది. రష్యా నుంచి చైనా.. డబుల్ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తోంది. మరి చైనాకు 90 రోజుల బ్రేక్ ఇచ్చారు. కానీ భారత్ కు మాత్రం 3 వారాలు మాత్రమే ఇచ్చింది అమెరికా. దీని వెనుక ఏదో సందేశం ఉందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications