ఓర్నీ... మార్నింగ్ వాక్ చేస్తున్న ఎంపీ చెయిన్ కొట్టేసిన దొంగ!
మహిళలు రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే వాళ్లకు సేఫ్టీ లేదు అన్న విషయం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. రోడ్డు మీద మహిళలు వెళుతుంటే చైన్ స్నాచింగ్ లు చేసే వాళ్ళు, నిర్మానుష్య ప్రదేశాలలో అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు, ఒంటరిగా వెళుతున్న మహిళలను చూస్తే ఏదో ఒక రకంగా రెచ్చిపోయే వాళ్ళు మన సమాజంలో ఇంకా కనిపిస్తూనే ఉన్నారు.
ఎంపీ మెడలో నుండి చెయిన్ కొట్టేసిన దొంగ
మహిళల రక్షణ కోసం రక్షణ వ్యవస్థలు ఎన్ని పనిచేస్తున్నా ఇంకా మహిళల రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అటువంటి పరిస్థితి ఓ ఎంపీకి ఎదురయింది. కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యురాలు సుధా రామకృష్ణన్ ఊహించని విధంగా నడిరోడ్డు మీద చెయిన్ స్నాచింగ్ కు గురయ్యారు. ఢిల్లీలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఎంపీ మెడలో నుండి ఓ వ్యక్తి చైన్ కొట్టేశాడు.

మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా, నడిరోడ్డుపై ఘటన
నడుస్తూ వెళుతున్న ఆమె మెడలో నుండి ముందు నుండి బండిమీద వచ్చిన వ్యక్తి చైన్ కొట్టేసి పారిపోయాడు. ఇక ఇదే విషయాన్ని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని మయిలాదుతురై పార్లమెంట్ నియోజకవర్గానికి సుధ రామకృష్ణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె డీఎంకే నాయకురాలు రజతితో కలిసి చాణక్యపురిలోని పోలండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమిత్ షా కు లేఖ రాసిన ఎంపీ
ఇక ఈ దొంగతనం పైన ఆమె కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 6:15, 6:20 సమయంలో ఓ వ్యక్తి స్కూటీపై నెమ్మదిగా హెల్మెట్ పెట్టుకుని వెళుతూ తమకు ఎదురుగా వచ్చాడని, నిదానంగా స్కూటీ మీద వస్తుండడం వల్ల తాను అనుమానించలేదని, తన దగ్గరకు రాగానే తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడని ఆమె పేర్కొన్నారు.
ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి
అతను గొలుసును బలంగా లాగడంవల్ల తన మెడకు గాయాలయ్యాయని, తన డ్రెస్ కూడా చినిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత సహాయం కోసం తాము ఎదురు చూడగా పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత ఉన్న ప్రాంతంలో ఎంపీగా ఉన్న తనపైనే ఈ విధమైన చైన్ స్నాచింగ్ దాడి జరిగిందంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.
న్యాయం చెయ్యాలని కోరిన ఎంపీ
ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె అన్నారు. నాలుగు సవర్ల బంగారు గొలుసులు పోగొట్టుకోవడం కాకుండా, తనకు గాయాలు కూడా అయ్యాయని చెప్పిన ఎంపీ సుధా రామకృష్ణన్ నిందితుడిని త్వరగా గుర్తించి తనకు న్యాయం జరిగేలా చూడాలని హోంమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications