మళ్లీ తెగబడి పాక్ కాల్పులు: ఓ సైనికుడి మృతి
శ్రీనగర్: భారత సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాశ్మీర్ సెక్టార్‌లోని యురి సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత సైనిక అధికారి ఒకరు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఓ వైపు దేశాధినేతలు శాంతి చర్చలు కొనసాగిస్తామని పేర్కొంటుండగా పాకిస్థాన్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇలాంటి ఘటనలకు తరచూ పాల్పడుతోంది.
పాక్ దళాలు ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గర్‌కు చెందిన జూనియర్ సైనిక అధికారి చందర్ ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారులు తెలిపారు. చందర్ కుమావున్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కమాన్ పోస్టు, శ్రీనగర్-ముజాఫరాబాద్ దగ్గర బస్సు మలుపు తిప్పుకుంటుండగా పాక్ దళాలు వారిపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారి నరేష్ విజ్ మీడియాకు తెలిపారు.

సరిహ్దద్దు ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తమ సైన్యంపై పాక్ దళాలు కాల్పులు జరిపాయని, భారత సైనికులు కూడా వారిని గట్టిగా ప్రతిఘటించారని ఆయన అన్నారు. కానీ తమ సైన్యంలోని అధికారి చందర్ పాక్ కాల్పుల్లో మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో ముజాఫరాబాద్- శ్రీనగర్ బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన చెప్పారు.
పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైనట్లు ఆయన చెప్పారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారి తెలిపారు. కాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తరచూ ఉల్లంఘిస్తున్న ప్రస్తుతం తరుణంలో కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని గత వారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.












Click it and Unblock the Notifications