సుప్రీంకోర్టుకు అయిదుమంది కొత్త న్యాయమూర్తులు - జాబితాలో తెలంగాణ జడ్జీ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా అయిదుమంది న్యాయమూర్తులు రాబోతోన్నారు. ఈ మేరకు ఆ అయిదు మంది పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఎంపిక చేసింది. వారి పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీన్ని న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది. సాధారణంగా- సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే సవరణల కోసం తిప్పి పంపిస్తుంటుంది.
వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో పని చేస్తోన్న ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ఉన్నారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
వారిలో జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ తెలంగాణకు చెందిన న్యాయమూర్తి. ప్రస్తుతం ఆయన మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. కాగా- బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా నియమితులైనట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరుసటి రోజే దీపాంకర్ దత్తా- బాధ్యతలను స్వీకరించారు. జస్టిస్ దత్తా నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. తాజాగా- కొలీజియం సిఫారసు చేసిన అయిదుమందిని కూడా కలుపుకొంటే సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కు పెరుగుతుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ఆరుమంది సభ్యుల కొలీజియం ఈ పేర్లను ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications