రాములోరి వివాదంలో సుప్రీంకోర్టు ఎంటర్- సీల్డ్ కవర్ లో..: నెక్స్ట్ హియరింగ్ పై
అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ సున్నితమైన వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యవసర నోటీసులను పంపించింది.
అయోధ్య రామాలయానికి దేశవిదేశాల నుంచి అందే విరాళాలను ట్రస్ట్ లోని కొందరు సభ్యులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఓ పద్ధతి ప్రకారం కొన్ని నెలలుగా ఈ దోపిడీ సాగింది. దీనిపై నిజనిజాలను నిగ్గు తేల్చాలంటూ పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ దర్యాప్తు దీనికి సరిపోదని, సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం సమక్షానికి వచ్చాయి ఆయా పిటీషన్లన్నీ. వాటిని బెంచ్ నిశితంగా పరిశీలించింది. అనంతరం ఈ నోటీసులు జారీ చేసింది. విరాళాల లూటీపై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సమగ్ర స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది.
దీనితో పాటు అసలు ఈ సిట్‌ను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారో తెలిపే రికార్డులను కూడా తమ ముందు ఉంచాలని బెంచ్ స్పష్టం చేసింది. సీల్డ్ కవర్ లో అన్ని వివరాలనూ తమకు సమర్పించాలని తేల్చి చెప్పారు సీజేఐ సూర్యకాంత్. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సిట్ దర్యాప్తు తాజా స్థితిగతుల వివరాలతో కూడిన నివేదికను సిద్ధంగా ఉంచామని, దానిని సీల్డ్ కవర్‌లో ధర్మాసనానికి అందజేస్తామని స్పష్టం చేశారు. దీంతో బెంచ్.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఆలయ విరాళాల నిధులకు సంబంధించి ప్రతి లావాదేవీని నిశితంగా పరిశీలించేందుకు కోర్టు పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా పిటిషనర్లు కోరారు. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న అయోధ్య ఆలయ నిధుల వ్యవహారమని గుర్తు చేశారు. ఈ సున్నిత కేసులో దోషులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications