తహవ్వుర్ రాణాను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, కోర్టు ఎదుట హాజరు
ముంబై ఉగ్రదాడి(26/11) కేసులో ప్రధాన సూత్రధారి, ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను భారత్‌కు తీసుకొచ్చారు. అమెరికా నుంచి అతడ్ని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాణా అరెస్ట్‌ను ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించింది.
ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ సీనియర్ అధికారులతో కూడిన బృందాలు రాణాను లాస్ ఏజెల్స్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు తెలిపింది. విమానాశ్రయంలో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం అతడు విమానం నుంచి బయటకు రాగానే.. అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

గురువారం రాత్రి తహవ్వుర్ రాణాను పటియాలా హౌస్ కర్టులో ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. 20 రోజులపాటు కస్టడీ ఇవ్వాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. అయితే, అయితే, పటియాల హౌస్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాణాను కోర్టుకు తీసుకొచ్చిన క్రమంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాణాను తీహార్ జైలుకు తరలించినట్లు సమాచారం.
ఈ కేసులో ఎన్ఐఏ తరపున సీనియర్ అడ్వకేట్ దయాన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ హాజరయ్యారు. అయితే, ఈ కేసు గురించి స్పందించేందుకు వారు నిరాకరించారు. మరోవైపు, తహవ్వుర్ రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పీయూష్ సచ్‌దేవ హాజరైనట్లు తెలిసింది.
కాగా, తహవ్వుర్ రాణాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాణాను చట్టం ముందు నిలబెట్టేందుకు ఏళ్ల తరబడి నిరంతర సమష్టి ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్‌డీఓజే, యూఎస్ స్కై మార్షల్, అమెరికాలోని సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు ఎన్ఐఏ పేర్కొంది.












Click it and Unblock the Notifications