వివాదంలో తమిళనాడు ప్రభుత్వం..అధికారిక లెక్కల్లో లేని 200 కరోనా మరణాలు..ఆడిట్ కు ఆదేశం
తమిళనాడులో కరోనావైరస్ రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తుంది . ఇక ఇదే సమయంలో కరోనా లెక్కలపై తమిళనాడు ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. అధికారిక లెక్కల్లో లేని కరోనా మరణాలు కూడా తమిళనాడులో సంభవించినట్టు తెలుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం కావాలని లెక్కలను తారుమారు చేసి చూపిస్తుందని , అధికారిక లెక్కల్లో లేని 200 కరోనా మరణాలు సంభవించాయని ఆరోపణలు వెల్లువగా మారాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆ లెక్కలను తేల్చేందుకు ఆడిట్ కమిటీని నియమించింది .

200 మరణాలు రాష్ట్ర అధికారిక లెక్కలకు రాలేదని ఆరోపణలు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ గా అనుమానించబడిన 200 మరణాలు రాష్ట్ర అధికారిక లెక్కలకు రాలేదన్న వార్త వెలుగులోకి వచ్చిన తరువాత తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో కరోనా కేసుల డెత్ ఆడిట్‌ను ఆదేశించింది, ఒక సీనియర్ ఆరోగ్య అధికారి చెప్పిన వివరాల ప్రకారం నగర కార్పొరేషన్ రికార్డుల యొక్క "ప్రాథమిక అంచనా" ఆధారంగా ఈ అంచనా ఆధారపడి ఉందని పేర్కొన్నారు . బుధవారం సాయంత్రం వరకు తమిళనాడు 326 కోవిడ్ మరణాలను నివేదించింది.

చెన్నై కార్పొరేషన్ రిజిస్ట్రీలో విధానపరమైన లోపంతో లెక్కల గజిబిజి
చెన్నై నగర పరిధిలో మాత్రమే 260 మంది మరణించారు. చెన్నై కార్పొరేషన్ యొక్క రిజిస్ట్రీలో రోజువారీగా మరణాలను నివేదించే వ్యవస్థ లేనందున ఈ "విధానపరమైన లోపం" తలెత్తిందని అధికారులు అంటున్నారు. అయితే చెన్నైలో 200 మరణాలు రాష్ట్ర అధికారిక లెక్కలకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తమిళనాడు ప్రభుత్వం కరోనా మరణాల తక్కువ సంఖ్యను చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఆరోపణలు మిన్ను ముడుతున్నాయి.

ఆరోపణలు ఖండించిన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్
ప్రభుత్వం సంఖ్యలను తారుమారు చేసిందని ,చాలా మరణాలను దాచిపెట్టిందని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్ మాట్లాడారు. కరోనా పాజిటివ్ మరణాల డేటాను క్రమబద్ధీకరించడానికి తొమ్మిది మంది సభ్యుల కమిటీ ప్రస్తుతం అటువంటి కేసులన్నింటినీ పరిశీలిస్తుందని , ఈ వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఒకపక్క కరోనా కట్టడిలో తమిళనాడు ప్రభుత్వం విఫలం అవుతున్న వేళ ఈ ఆరోపణలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి.
Recommended Video

ఇప్పటివరకు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 36,841.. మరణాలు 326
ఇక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,841కి చేరింది. ఇక కరోనా చికిత్స పొంతున్నవారిలో బుధవారం ఒక్కరోజే 19 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 326కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులతో 17,182 మంది వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకూ 19,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ 6,09,856 మందికి టెస్ట్‌లు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే 16,667 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications