లోకసభలో టీ బిల్లు: వరుస సంఘటనలు ఇలా..

న్యూఢిల్లీ: లోకసభలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం లోకసభలో బిల్లును ప్రతిపాదించడానికి ఉద్యుక్తమైనప్పటి నుంచి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, ఆ తర్వాత గురువారంనాడు అనూహ్యమైన సంఘటలు చోటు చేసుకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో సంఘటనలు జరిగి, దేశం యావత్తూ నివ్వెరపోయేలా చేశాయి.
లోకసభలో తీవ్ర ఉద్రిక్తత మధ్య, గందరగోళం మధ్య షిండే బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టలేదని బిజెపి నేత సుష్మా స్వరాజ్‌తో పాటు మరికొన్ని పార్టీలు అంటుండగా, ప్రవేశపెట్టామని, కావాలంటే ఫుటేజీలు చూసుకోవచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అన్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల సభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయి కలబడ్డారు. బిజెపికి ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభలో సభ్యులు లేకపోవడం వల్ల ఆ పార్టీ పరువు దక్కించుకుందని చెప్పవచ్చు. పైగా, కాంగ్రెసు పార్టీపై తీవ్రమైన విమర్శలు చేయడానికి అవకాశం లభించింది. కాంగ్రెసు పార్టీయే జరిగిన సంఘటలకు బాధ్యత వహించాలని బిజెపి నాయకులు అంటున్నారు. వరుసగా ఆ సంఘటనలు చూద్దాం...
- తెలంగాణ, ఇతర అంశాలపై సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభను స్పీకర్ మీరా కుమార్ ఉదయం పూట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
- తిరిగి సభ సమావేశమైన తర్వాత తెలంగాణ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనప్పుడు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
- విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేశారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
- తెలంగాణ అనుకూల, వ్యతిరేక సభ్యులు వెల్‌లోకి చేరడంతో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరు ప్రాంతాల సభ్యులు ఘర్షణకు దిగారు.
- పెప్పర్ స్ప్రే చల్లినప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇతర సభ్యుల నుంచి కాపాడుతూ లగడపాటి రాజగోపాల్'బం మాపద ధగైద వార్డు స్టాఫ్ బయటకు తీసుకుని వెళ్లారు.
- తెలంగాణకు వ్యతిరేకంగా రాజ్యసభలో తెలుగుదేశం సీమాంధ్ర సభ్యుడు సిఎం రమేష్ రాజ్యసభ చైర్మన్ మైక్‌ను లాగేయడానికి ప్రయత్నించారు.
- ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
- తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టినట్లు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు.
- తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టినందుకు నిరసనగా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ముగ్గురు శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణా రెడ్డి, బి. సత్యానందరావు హైదరాబాదులో ప్రకటించారు.
- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై పెద్ద మచ్చగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
- తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాలు పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగాయి.
- కత్తులు, మిరియాల పొడి, ఇతర ఆయుధాలను సభలోకి తెచ్చారని తనకు తెలిసిందని కమల్ నాథ్ చెప్పారు.
- లగడపాటి రాజగోపాల్‌ను అరెస్టు చేయాలని సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా డిమాండ్ చేశారు.
- పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని, ప్రస్తుతం అది సభా ప్రాపర్టీ అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
- మిరియాల పొడి ప్రభావానికి గురైన సభ్యులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మిరియాల పొడి వాసన సభ వెలుపల కూడా కనిపించింది.
- మిరియాల పొడి ప్రభావానికి గురైన స్పీకర్ మీరా కుమార్ వేగంగా ఇంటికి వెళ్లిపోయారు.
- జరిగిన సంఘటన అత్యంత సిగ్గుపడాల్సిందని, ప్రజాస్వామ్యానికి మచ్చ అని స్పీకర్ మీరా కుమార్ అన్నారు.
- ఇంతటి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రతిపాదించాల్సి ఉందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు
- తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన ఈ రోజు చారిత్రాత్మకమైందని, తమ లక్ష్యం దాదాపుగా నెరవేరిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు.
- సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
- ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకసభలో కాంగ్రెసు డ్రామా ఆడిందని, బిజెపి భవిష్యత్తులో ప్రభుత్వంతో చర్చలు జరపబోదని సుష్మా స్వరాజ్ అన్నారు.
- తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. తాము కోర్టుకు ఎక్కుతామని చెప్పారు.
- రెండు గంటలకు సమావేశమైన రాజ్యసభ సోమవారానికి వాయిదా పడగా, లోకసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
- సభను అడ్డుకుని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
- గుండెపోటు రావడంతో సభలో పడిపోయిన తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర సభ్యుడు కొనకళ్ల నారాయణ రావును ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన గుండెజబ్బుతో బాధపడుతున్నారు.
- లోకసభ సోమవారానికి వాయిదా పడింది.
- బిజెపి, ఎస్పీ, బిజెడి, సిపిఐ, టిఎంసి నాయకులు స్పీకర్ మీరా కుమార్‌ను కలిసి తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టామనే విషయాన్ని తాము అంగీకరించబోమని చెప్పారు.
- సభలోకి తాను కత్తి తేలేదని టిడిపి సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
- తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.
- లోకసభలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుపై దుమ్మెత్తిపోశారు.
- తెలంగాణను అడ్డుకోవడానికి ఇంకా చివరి బంతి విసరలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
- ఆత్మరక్షణ కోసమే తాను మిరియాల పొడి చల్లానని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ ఎంపీలు దాడి చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
- సీమాంధ్ర ఎంపీల తీరును, లగడపాటి చర్యను కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు తీవ్రంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications