The Kerala Story సినిమాపై వరాల జల్లు
ముంబై: లేటెస్ట్‌గా విడుదలైన బాలీవుడ్ మూవీ ది కేరళ స్టోరీ. రాజకీయంగా దుమారం రేపుతోంది. కేరళకు చెందిన వేలాదిమంది మహిళలు మాయం అవుతున్నారని, లవ్ జిహాద్ పేరుతో వాళ్లంతా బలవంతంగా మత మార్పిడికి గురవుతున్నారని, భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్‌లో చేరుతున్నారనేది ఈ సినిమా సారాంశం. దీని చుట్టూ కథను అల్లుకుని తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తొ సేన్.
అదా శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ఇతర పాత్రలను పోషించారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది ది కేరళ స్టోరీ. సన్ షైన్ బ్యానర్స్ కింద నిర్మాత విపుల్ షా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. రాజకీయ దుమారానికి కేంద్రబిందువయింది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సినిమా కథాంశాన్ని తప్పుపట్టారు. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమా ప్రదర్శనను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా ప్రకటించారు.
ఈ మూవీ మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే ఈ సినిమా తెరకెక్కిందంటూ మమత బెనర్జీ విమర్శించారు. తాను అధికారంలోకి రాష్ట్రాలపై బురదజల్లడం, అక్కడి ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకుని రావడం అలవాటేనంటూ పరోక్షంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి చెప్పారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు.

అదే కేరళ స్టోరీ సినిమాపై ఉత్తరప్రదేశ్ వరాల జల్లును కురిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ది కేరళ స్టోరీ సినిమాకు వినోదపు పన్నును మినహాయింపు లభించింది. ఈ సినిమాను ప్రజలకు మరింత చేరువ చేయడానికి పన్ను మినహాయింపును ఇచ్చినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ట్వీట్ చేశారు.
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
ఉత్తరప్రదేశ్ సచివాలయం లోక్ భవన్‌లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన మంత్రివర్గ సహచరులతో కలిసి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమాను తిలకిస్తారని పేర్కొంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఎప్పుడనేది ఇంకా నిర్ధారించలేదు. వంద మంది బాలికలతో కలిసి ఇటీవలే బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి రాఘవేంద్ర మిశ్రా ఈ సినిమాను తిలకించారు. కాగా- బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇదివరకే ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications