Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‍లో ముగిసిన ఎన్‍కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఏడురోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ మంగళవారం ముగిసింది. భద్రత బలగాలు లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్‌ను హతమార్చాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ADGP) విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌దిగా నిర్ధారించారు. అనంతనాగ్ జిల్లాలోని కొకెర్‌నాగ్ ప్రాంతంలో దాగి ఉన్న ముష్కరుల కోసం భద్రతా సిబ్బంది గత మంగళవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు దాగి ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిగాయి.

కాల్పుల్లో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు మేజర్ ఆశిష్ ధొనక్, జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్ భట్ వీరమరణం పొందారు. అదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ కూడా గల్లంతయింది. సెప్టెంబర్ 18 ఆ జవాను భౌతికకాయాన్ని పోలీసులు కనుగొన్నారు. అతడు పంజాబ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ అని ఆర్మీ అధికారులు చెప్పారు. ఉగ్రవాది ఉజైర్ ఖాన్ పై 10 లక్షల రివార్డు ఉంది.
ఉజైర్ ఖాన్ కోకెర్‌నాగ్‌లోని నౌగామ్ గ్రామ నివాసిగా ఉన్నారు. జూన్ 2022 నుంచి ఉజైర్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరాడు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి గాయపడిన అధికారులను తరలించడం కూడా చాలా సవాలుగా మారింది. సిబ్బంది, హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications