వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

{image-_116194650_gooptusperections1930'sindianfountainpen011.jpg telugu.oneindia.com}

భారత్‌లో చేత్తో తయారుచేసే ఫౌంటెయిన్ పెన్నులకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంటోంది. విదేశాల్లో ఉంటున్నవాళ్లు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి మరీ వీటిని తయారు చేయించుకుంటున్నారు.

నవలా రచయిత అమితవ్ ఘోష్ కూడా అలాంటివారిలో ఒకరు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసం ఉంటున్నారు. భారత్‌లోని ఓ కళాకారుడికి ఫౌంటెయిన్ పెన్ను కోసం ఆర్డర్ ఇచ్చారు.

''ఆన్‌లైన్‌లో చివరగా చూసినప్పుడు, నా పెన్ను రావడానికి ఇంకా 95 వారాలు పడుతుంది అని చూపించింది’’ అని అమితవ్ అన్నారు. అంటే, చేత్తో తయారు చేస్తున్న పెన్నులకు అంత డిమాండ్ ఉందన్న మాట. అంతకాలమైనా అమితవ్ పెన్ను కోసం వేచిచూస్తానంటున్నారు.

న్యూయార్క్‌కు 12,500 కి.మీ.ల దూరంలో ఉన్న పుణెలో మనోజ్ దేశ్‌ముఖ్ చేతుల్లో ఆయన పెన్ను తయారవ్వాలి.

ఓ చిన్న అపార్టుమెంటులో పెన్నులను తీర్చిదిద్దే పని చేస్తున్నారు మనోజ్. ఆయన పెన్నులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. ఆయన వద్ద ఉద్యోగులు ఎవరూ లేరు.

''ఒక పెన్ను తయారు చేయడానికి ఒకటి నుంచి నాలుగు రోజుల దాకా పడుతుంది. ఫోస్ఫోర్ అన్న బ్రాండ్ పేరుతో వీటిని అమ్ముతున్నాం’’ అని మనోజ్ అన్నారు.

ఫౌంటెయిన్ పెన్ను

ఆరేళ్ల క్రితం వరకూ మనోజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. అప్పటికే ఆయనకు ఆ వృత్తిలో 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఓ హాబీగా ఆయన పెన్నులు తయారు చేయడం మొదలుపెట్టారు.

ఆయన తన మొదటి పెన్నును రోజ్ వుడ్‌తో తయారుచేశారు. యూట్యాబ్ వీడియోలు చూసి ఒక రోలింగ్ పిన్‌తో పెన్నును చెక్కారు. ఆ తర్వాత ఆన్‌లైన్ వేదికల్లో అమ్మకానికి పెట్టారు. ఐదు వేల రూపాయలకు ఆ పెన్నును విదేశాల్లో ఉండే ఓ వ్యక్తి కొనుక్కున్నారు.

ఇప్పుడు మనోజ్ పెన్ను కావాలంటే, ఆర్డర్ ఇచ్చినవాళ్లు రెండేళ్ల దాకా ఎదురుచూడాల్సి వస్తుంది. 10 మోడళ్లను ఆయన తయారు చేస్తున్నారు. రకరకాల రంగుల్లో వీటిని రూపొందిస్తారు. ధర ఐదు వేల రూపాయల నుంచి 11 వేల రూపాయల దాకా ఉంటుంది.

పెన్నులు తయారు చేయడమంటే తనకు అమితమైన ఆసక్తి అని మనోజ్ అన్నారు.

మనోజ్ లాగే ఇలా పెన్నులు తయారు చేసే కళాకారులు చాలా మందే పనిచేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు.

''చేత్తో తయారు చేసిన పెన్నులకు భారత్ కేంద్రంగా మారింది. ప్రపంచమంతటికీ మా పని తెలుస్తోంది’’ అని ఎంపీ కందన్ అన్నారు. తమిళనాడులోని తిరువళ్లూర్‌లో ఉన్న రంగ పెన్స్ సంస్థ యజమాని ఆయన.

ధర తక్కువగా ఉండటం, మంచి డిజైన్లతో రూపొందిస్తుండటంతో ఈ పెన్నులకు గిరాకీ బాగా ఉంటోంది.

ఎబోనైట్ అనే ఓ రకం రబ్బరుతో ఈ పెన్నులను ఎక్కువగా చేస్తున్నారు. పగుళ్లే పెట్టని పారదర్శక ప్లాస్టిక్ అర్కిలిక్‌తోనూ రూపొందిస్తున్నారు.

టైటానియం, ఇత్తడి, రాగి, ఉక్కు, అల్యూమినయం, కలప, గంధపు చెక్క, బర్రె కొమ్ము లాంటి వాటితోనూ ఈ పెన్నులు చేస్తున్నారు.

ఆ పెన్నుల మీద రంగురంగుల బొమ్మలు వేస్తారు. పెన్నులకు నిబ్బులు, సిరా నింపే సామగ్రిని సాధారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

మనోజ్ దేశ్‌ముఖ్

ఈ పెన్నులను కొంటున్నవారిలో వైద్యులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, రచయితలు ఎక్కువగా ఉంటున్నారు. చాలా వరకూ మగవాళ్లే.

యూసుఫ్ మన్సూర్ కూడా ఇలాంటి పెన్నులను సేకరిస్తుంటారు. ఆయన జియాలజిస్ట్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆయన వద్ద ఇప్పుడు ఏడు వేల పెన్నులు ఉన్నాయి.

పెన్నులు మగవాళ్లకు ఆభరాణల్లాంటివని ఆయన అంటుంటారు.

పెన్నులు తయారుచేస్తున్నవారిలో వ్యాపారవేత్తలు, ఉద్యోగ విరమణ చేసినవారు, ప్రొషెషనల్ కెరీర్లను వద్దనుకున్నవారు ఉంటున్నారు. ఎక్కువ మంది హాబీగా వీటిని మొదలుపెట్టినవారే.

ఎల్ సుబ్రమణ్యంకు 48 ఏళ్లు. టెలికాం రంగంలో 20 ఏళ్లకుపైగా పనిచేసిన ఆయన 2013లో పెన్నుల తయారీలోకి దిగారు.

''చిన్నప్పుడు నా జేబులో పది ఫౌంటెయిన్ పెన్నులు ఉండేవి. ఓ రోజు వీటిని నేనే సొంతంగా తయారు చేయాలని అనుకున్నా. వాట్సాప్ గ్రూపుల్లో డిజైన్లు చూసి, చేయడం మొదలుపెట్టా’’ అని ఆయన అన్నారు.

నెలకు ఆయన 350 పెన్నుల దాకా తయారు చేస్తారు. ఒక్కోటీ వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయల దాకా ధర పలుకుతుంది.

బర్రె కొమ్ముతో చేసిన పెన్ను

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష్మణ రావు కుటుంబం 80 ఏళ్లుగా చేత్తో పెన్నులు తయారు చేస్తోంది. ఆయన ఆ కుటుంబంలో రెండో తరం కళాకారుడు.

వీరి వద్ద 300 దాకా మోడళ్లు ఉన్నాయి. ధర రూ.365తో మొదలై యాభై వేల రూపాయల దాకా ఉంటుంది.

రూ. 4,700 రూపాయల ధర ఉండే తెల్ల రంగు పెన్నును ఎక్కువ మంది ఇష్టపడుతుంటారని ఆయన చెప్పారు.

రంగా పెన్స్ సంస్థ 250 రంగుల్లో 400 మోడళ్ల పెన్నులు విక్రయిస్తోంది. నెలకు 500కుపైగా పెన్నులు అమ్ముడువుతున్నాయని, ఎక్కువ ఆర్డర్లు విదేశాల నుంచే వస్తుంటాయని ఆ సంస్థ చెప్పింది.

యూసుఫ్ మన్సూర్

న్యూయార్క్‌కు చెందిన రచయిత పిట్చాయా సుద్బంతాడ్ వద్ద భారత్ నుంచి తెప్పించుకున్న పెన్నులు అర డజనకుపైనే ఉన్నాయి.

''ఒక్కో పెన్ను ఇచ్చే అనుభవం ఒక్కోలా ఉంటుంది. వీటిలో చాలా ఇంకు పడుతుంది. ఇవి మరో తరానికి చెందిన పెన్నులు. ఇటలీలోనూ ఇలాగే చేత్తో పెన్నులు తయారుచేసేవాళ్లుంటారు. వీటిలో కళకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తయారు చేసేందుకు వాడిన పదార్థమో, బ్రాండింగో ముఖ్యం కాదు’’ అని ఆయన అన్నారు.

''పెన్సిల్ నుంచి పెన్నుతో రాసే స్థాయికి చేరుకున్నామంటే మనం ఇక చిన్న పిల్లలం కాదన్నమాట. ఆ రోజుల్లో మన జీవితంలో పెన్నుది గొప్ప పాత్ర. ఫౌంటెయిన్ పెన్ను ఉంటే ఓ బ్లాటర్, డ్రాపర్ ఇవన్నీ వెంట తీసుకువెళ్లేవాళ్లం. బట్టలపై ఎప్పుడూ మరకలు పడేవి’’ అని అమితవ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు.

''పెన్నుతో రాయడంలో వచ్చే మజా మాత్రం ఎప్పటికీ పోదు. నేను దాంతో కొన్ని లక్షల పదాలు రాసుంటా’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
These pens are made in India and are in demand all over the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X