తమిళనాడులో బీహార్ కూలీలపై దాడులు: ఫేక్ వీడియో చేసిన నిందితుల అరెస్ట్
తమిళనాడు రాష్ట్రంలో బీహార్ కూలీలపై దాడులు జరిగినట్లుగా నకిలీ వీడియోలను చిత్రీకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై/పాట్నా: తమిళనాడు రాష్ట్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలపై దాడులు జరుగుతున్నట్లుగా ఉన్న వీడియోలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అటు తమిళనాడు, ఇటు బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీలపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. అయితే, తమిళనాడులో బీహార్ కూలీలపై ఎలాంటి దాడులు జరగలేదని, ఇక్కడ ఎవరైనా సురక్షితంగా ఉండవచ్చని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో బీహార్ కూలీలపై దాడులు జరిగినట్లుగా నకిలీ వీడియోలను చిత్రీకరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాకేష్ రంజన్ కుమార్ సింగ్ తోపాటు అతనితో కలిసి పనిచేసిన అనిల్ యాదవ్, ఆదిత్య కుమార్ అనేది ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బీహార్ కూలీలుగా నటించారని పాట్నా పోలీసులు తెలిపారు.

మార్చి 10న పాట్నాలో రంజన్ కుమార్ సింగ్ ఉంటున్న నివాసానికి చేరుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. బీఎన్ఆర్ న్యూస్ ఏజెన్సీ పేరుతో రంజన్ సింగ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అతని గదిలోనే ఈ నకిలీ వీడియోలను చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూలీలపై దాడి అంశం అలజడి రేపింది.
మార్చి 8న గోపాల్‌గంజ్ జిల్లాలోని రంజన్ సింగ్ స్వగ్రామంలోనే అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తానే నకిలీ వీడియోలను రూపొందించి వైరల్ చేసినట్లు నిందితుడు రంజన్ సింగ్ పోలీసులు ముందు అంగీకరించాడు. ఇక ఆ వీడియోలో గాయపడిన బీహార్ కూలీలుగా నటించిన అనిల్ యాదవ్, ఆదిత్య కుమార్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యూట్యూబర్ మనీష్ అనే వ్యక్తి సూచనతో తాను ఈ వీడియో చేసినట్లు నిందితుడు రంజన్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications