తిరుమలకు రాజపక్స: తమిళనాట, తిరుపతిలో ఆగ్రహజ్వాలలు
చిత్తూరు/చెన్నై: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తిరుపతి పర్యటనను నిరసిస్తూ తమిళనాడులో, తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో దాదాపు 70 మంది తమిళులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రాజపక్స బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. రాజపక్స రాక నేపథ్యంలో టీటీడీ అంగ ప్రదర్శనను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. సుప్రభాత సేవ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే.

మంగళవారం సాయంత్రం రాజపక్స రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుమల హిల్స్ చేరుకుంటారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. తిరిగి బుధవారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. తొమ్మిదిన్నర గంటలకు కొలంబోకు పయనమవుతారు. రాజపక్స రాక నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తమిళనాడులోను పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సహా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి రాజపక్స రాకకు నిరసన వ్యక్తం చేశారు. కోయంబత్తూరులో దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మరోచోట ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్న ఆమె వ్యాఖ్యలను వారి నిరసించారు.












Click it and Unblock the Notifications