కేంద్ర బడ్జెట్‌ను తొలిసారి హిందీ భాషలో ఎప్పుడు ప్రింట్ చేశారో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.
బడ్జెట్ అనేది ఒక ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అంచనా వేసిన ఆదాయాలు, వ్యయాల ప్రకటన. అయితే, బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 (5వ భాగం) ప్రకారం.. భారత రాష్ట్రపతి ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరానికి అంచనా వేసిన వసూళ్ల, ఖర్చుల ప్రకటనను పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి.

బడ్జెట్ లేదా వార్షిక ఆర్థిక నివేదికను ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కింద బడ్జెట్ విభాగం తయారు చేస్తుంది. నీతి అయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి రూపుదిద్దుకుంటుంది. కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఇండియన్ యూనియన్ అధికారిక భాషలైన ఇంగ్లీష్, హిందీలో తయారు చేస్తారు.
అయితే, కొత్తగా స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ ను వలస సంప్రదాయాలను అనుసరించి సంప్రదాయంగా ఇంగ్లీషులోనే ముద్రించారు. కాగా, వలస పాలనలో బ్రిటీష్ ఎంపీ జేమ్స్ విల్సన్ 1860లో మొట్టమొదటి సారి భారతీయ బడ్జెట్‌ను సమర్పించారు. బ్రిటీష్ ప్రజలు, భాషలో ప్రావీణ్యం ఉన్న భారతీయ పాలక వర్గం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.
1950లో సీడీ దేశ్‌ముఖ్ ఆర్థిక మంత్రి అయ్యారు. మొదటి పంచవర్ష ప్రణాళిక అమలును పర్యవేక్షించారు. జనవరి 1, 2015లో నీతి ఆయోగ్ గా మార్చిన అప్పటి ప్రణాళిక సంఘానికి ఆయన ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా కూడా కొనసాగారు.
1955లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి సీడీ దేశ్‌ముఖ్ భారత ప్రజల కోసం బడ్జెట్ తీసుకురావాలని నిర్ణయించే వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. 1955 బడ్జెట్ పత్రాన్ని ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ముద్రించాలని దేశ్‌ముఖ్ నిర్ణయించారు. దీంతో అప్పట్నుంచి హిందీలోనూ కేంద్ర బడ్జెట్ ముద్రించడం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications