మాజీ సీఎం మీద అమిత్ షా ఫైర్, ఎలా గెలుస్తారు ?, అది మా అడ్డా !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం సొంత పార్టీని వదిలేసి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోకి వెళ్లిపోయిన నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ నమ్మక ద్రోహి అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం కర్ణాటకలోని హుబ్బళిలోని ప్రైవేట్ హోటల్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి మీడియాతో మాట్లాడిన అమిత్ షా మాజీ సీఎం జగదీష్ శెట్టర మీద విరుచుకుపడ్డారు. సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ కు పదవులు ఇచ్చిన బీజేపీ ఆయన్ను చాలా గౌరవించిందని అమిత్ షా గుర్తు చేశారు.

అన్ని పదవులు అనుభవించిన జగదీష్ శెట్టర్ అన్నం పెట్టిన బీజేపీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని అమిత్ షా మండిపడ్డారు. ఈ సారి మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కచ్చితంగా ఓడిపోతారని, ఇంతకాలం నమ్ముకున్న బీజేపీ కార్యకర్తలే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కు బుద్ది చెప్పడానికి వేచి చూస్తున్నారని అమిత్ షా అన్నారు.
హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉందని, జగదీష్ శెట్టర్ మాత్రం తనకు మించిన నాయకుడు లేడని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తాము లింగాయత్ లకు మోసం చేసి జగదీష్ శెట్టరకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు.

హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలో ఈ సారి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మొదట జగదీష్ శెట్టర్ ను అడిగామని, అందుకు ఆయన అంగీకరించలేదని, ఇప్పుడు కూడా జగదీష్ శెట్టర్ ను కాదని వేరే కులం వాళ్లకు అక్కడ సీటు ఇవ్వలేదని, లింగాయత్ కులానికి చెందిన మహేష్ టింగినకాయకు టిక్కెట్ ఇచ్చామని అమిత్ షా అన్నారు. జగదీష్ శెట్టర్ కచ్చితంగా ఓడిపోతారని కేంద్ర మంత్రి అమిత్ షా పదేపదే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications