UP Polls: ఓటువేసి ఫొటో దిగి, సోషల్ మీడియాలో పోస్ట్, బీజేపీ మహిళా మేయర్‌పై కేసు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఓటింగ్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుని చిక్కుల్లో పడ్డారు.
Recommended Video

పోలింగ్ బూత్‌లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఈరోజు జరుగుతుండగా, కాన్పూర్ మేయర్, బీజేపీ నాయకురాలు ప్రమీలా పాండే పోలింగ్ బూత్‌లో తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదంగా మారింది. పాండే.. హడ్సన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఆమె ఓటు వేసేటప్పుడు తన ఫొటోను తీసుకోవడమే కాకుండా, వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బీజేపీ మేయర్ ప్రమీల పాండేపై కేసు నమోదు
‘ప్రజాస్వామ్యం గొప్ప పండుగలో ఈరోజు ఓటింగ్ వంతు వచ్చింది. దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి' అని పాండే పోలింగ్ బూత్ నుంచి ఫోటోతో ట్విట్టర్‌లో రాశారు. కాగా, పర్యవసానంగా, పోలింగ్ రహస్య నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాన్పూర్ నగర్ డీఎం నేహా శర్మ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా వ్రాశారు, "కాన్పూర్‌లో, హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించినందుకు సంబంధిత సెక్షన్ల కింద ప్రమీలా పాండేపై FIR నమోదు చేయబడింది' అని స్పష్టం చేశారు.
మరో బీజేపీ నేతపైనా ఇలాంటి కేసే నమోదు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కేసులో అభియోగాలు మోపబడిన ఏకైక బీజేపీ నాయకురాలు ప్రమీలా పాండే కాదు. మరో బీజేపీ నేత నవాబ్ సింగ్‌పై కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. బీజేపీ యువమోర్చా మాజీ అధ్యక్షుడు నవాబ్ సింగ్ ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించినందుకు అతనిపై కూడా అభియోగాలు మోపారు.
కాన్పూర్ నగర్ డీఎం కూడా ట్వీట్ చేస్తూ.. పోలింగ్ బూత్‌లో ఓటు వేసే రహస్యాన్ని ఉల్లంఘించినందుకు సంబంధిత సెక్షన్ల కింద బీజేపీ యువమోర్చా మాజీ అధ్యక్షుడు శ్రీ నవాబ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతోంది అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఆదివారం మూడో దశ పోలింగ్ జరుగుతోంది. యూపీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. చివరి దశ ఎన్నికలు మార్చి 7న, ఓట్ల లెక్కింపు మార్చి 10న నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications