బీజేపీకి షాక్: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉత్తరాఖండ్ మంత్రి, ఆయన తనయుడు
డెహ్రాడూన్: వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. సెప్టెంబర్ నెలలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా.. తాజాగా, రాష్ట్ర మంత్రి యాస్పల్ ఆర్య బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఎంలను మార్చిన తర్వాత పార్టీలో విబేధాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామితో మంత్రులకు పొసగడం లేదు. కొందరు మంత్రులు పరోక్షంగా, ప్రత్యంగా విమర్శలు చేస్తున్నారు.

తాజాగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ నేత యాష్పల్ ఆర్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సమక్షంలో యష్పల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నైనిటాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు సంజీవ్.
ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన నివాసంలో యాష్పల్, ఆయన కుమారుడు సంజీవ్ కలిశారు. కాగా, యష్పల్ ఆర్య 2017 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2002-2007 మధ్యకాలంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
2007 నుంచి 2014దాకా ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. నరేంద్ర మోడీ హవాలో కాంగ్రెస్ బలహీనపడటంతో 2017లో బీజేపీలో చేరిన యష్‌పాల్ ఆర్య.. మళ్లీ ఇప్పుడు సొంత గూటికి చేరారు. యష్‌పాల్ ఆర్య ప్రస్తుతం ముక్తేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉత్తరాఖండ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత యష్పల్ కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా తెలిపారు. గతంలో యాష్పల్ ఆర్య ఉత్తరఖాండ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని తెలిపారు. ఉత్తరఖాండ్ కాంగ్రెస్ కమిటీలో సుదీర్గ కాలంగా యాష్పల్ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
యాష్పల్ రాకతో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని సూర్జేవాలా వ్యాఖ్యానించారు. తాను తిరిగి దేవాలయం లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని యాష్పల్ ఆర్య వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.
తిరిగి తన సొంత కుటుంబంలోకి వచ్చానని యాష్పల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని మించినది లేదన్నార. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి వుందన్నారు. ఈ పార్టీలో అనేక పదవులను పొందినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications