తుది పోరు: ఇక అందరి దృష్టీ 8 మీదే
Jammu Kashmir Assembly election 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆరంభమైంది. ఇదే చివరి దశ. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది.
దశాబ్ద కాలం తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18, 25వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పుడు చివరిది.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే పూర్తి చేసింది. పోలింగ్ సజావుగా సాగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేసింది. అలాంటి ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోంది.
ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. నేడు.. ఉధంపూర్ వెస్ట్, ఉధంపూర్ ఈస్ట్, ఛెన్ని, రామ్ నగర్, బణి, బిల్లావర్, బసోహ్లి, జస్రోటా, కథువా, హీరానగర్, రామ్‌గఢ్, సాంబ, విజయ్‌పూర్, బిష్నా, సుచేత్‌గఢ్, ఆర్ ఎస్ పురా, జమ్మూ సౌత్, బహు, జమ్మూ ఈస్ట్, నగ్రోటా, జమ్మూ వెస్ట్, జమ్మూ నార్త్, అఖ్నూర్, ఛాంబ్‌లల్లో పోలింగ్ జరుగుతోంది.
అలాగే- కర్నా, త్రేఘాం, కుప్వారా, లోలాబ్, హంద్వారా, లంగేట్, సోపోర్, రఫియాబాద్, యూరి, బారాముల్లా, గుల్మార్గ్, వాగూరా-క్రీరీ, పట్టన్, సోనావరి, బండీపోరా గురేజ్ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
దేవేందర్ సింగ్ రాణా- బీజేపీ, రమణ్ భల్లా- కాంగ్రెస్, మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్- కాంగ్రెస్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజద్ లోన్.. చివరి విడత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. విజయం ఎవరిని వరిస్తుందనేది ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది.












Click it and Unblock the Notifications