ఒక్క ముస్లిం ఓటు కూడా మాకు అక్కర్లేదు: కర్ణాటక మాజీ మంత్రి
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయా పార్టీలన్నీ సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోన్నప్పటికీ- వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్‌బై చెప్పారు.

పార్టీ సీనియర్ నేతలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. యడ్యూరప్ప కుమారుడు బీవై విజేంద్ర పోటీలో ఉన్నారు. ఈశ్వరప్ప కూడా తన కుమారుడికి టికెట్ ఇప్పించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన సొంత నియోజకవర్గం శివమొగ్గ టికెట్‌ను మరో సీనియర్ నాయకుడు చన్నబసప్పకు కేటాయించింది బీజేపీ.
ప్రస్తుతం శివమొగ్గలో చన్నబసప్ప తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు ఈశ్వరప్ప. ఇందులో భాగంగా వక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గ ప్రతినిధులతో శివమొగ్గలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని తెలిపారు. ముస్లింలెవరూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ముస్లింలకు ఎంత చేసినా తమకు ఓటు వేయరని పేర్కొన్నారు ఈశ్వరప్ప. తమ ప్రభుత్వ హయాంలో ముస్లింల విద్య, వైద్యం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, అయినప్పటికీ వారు బీజేపీకి ఓటు వేయరని అన్నారు. శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 60,000 వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారని, వారి ఒక్క ఓటు కూడా తమకు అవసరం లేదని ఈశ్వరప్ప అన్నారు.
గతంలో కూడా ఈశ్వరప్ప అజాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మైక్రో ఫోన్లు, లౌడ్ స్పీకర్లను ఉపయోగించి ప్రార్థనలు చేస్తే గానీ అల్లాకు వినిపించదా? ఆయనకు ఏమైనా చెవుడా? అంటూ ప్రశ్నించారు. అల్లా చెవిటివాడు కావడం వల్ల ముస్లింలో ఇలా లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు చేస్తారని వ్యాఖ్యానించారు. అజాన్ తన చెవిన ప్రతీసారీ తలనొప్పి వస్తుంటుందని పేర్కొన్నారాయన.












Click it and Unblock the Notifications