కరోనా వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన: తొలి ఇంజెక్షన్ వారికే: రూట్ మ్యాప్ రెడీ
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన వేళ.. తొలి వ్యాక్సిన్‌ను కరోనా పేషెంట్లకు అందజేసిన సందర్భంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఏఏ దశల్లో ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేసింది. కోవిషీల్డ్-సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కోవాగ్జిన్-భారత్ బయోటెక్, జైకోవి-డీ-క్యాడిలా హెల్త్‌కేర్, స్పుత్నిక్-వీ-డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎన్‌వీఎక్స్-సీఓవీ2373-సీరమ్ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్‌లో ఉన్నాయని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.
Recommended Video

అనుమతుల కోసం సీరమ్, భారత్ బయోటెక్..
అత్యవసర స్థితిలో కరోనా వ్యాక్సిన్‌ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలంటూ పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్.. ప్రతిపాదనలను పంపించినట్లు ఆయన తెలిపారు. ఈ రెండింటితో పాటు మొత్తం ఆరు వ్యాక్సిన్లు త్వరలో భారత్‌లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించిన వెంటనే వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనుమతులు లభించిన వెంటనే పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.

చిట్ట చివరి వ్యక్తికీ
దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందజేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను తాము రూపొందించుకున్నామని రాజేష్ భూషణ్ తెలిపారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకూ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపడతామని అన్నారు. 130 కోట్ల మంది వరకు ఉన్న జనాభాకు వ్యాక్సిన్‌ను అతి తక్కువ కాలంలో ఎలా చేరవేయాలనే విషయంపై తము పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల సహకారంతో ఎంతో అవసరం అవుతుందని అన్నారు. మరో ఒకట్రెండు వారాల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతులు లభించే అవకాశం ఉందని వివరించారు.

సగానికి పైగా కేసులు ఆ అయిదు రాష్ట్రాల నుంచే..
దేశంలో మొత్తం 97 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని రాజేష్ భూషణ్ చెప్పారు. అందులో నాలుగు లక్షలకు దిగువగా మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల కంటే దిగువకు చేరిందని, 3,83,866 నమోదైందని ఆయన వివరించారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీల్లో నమోదైన పాజిటివ్ కేసుల వాటా 54 శాతంగా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఈ ఏడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ నివేదిక ప్రకారం.. ప్రాధాన్యత క్రమాన్ని నిర్దారిస్తామని అన్నారు.

ప్రాధాన్యత వీరికే..
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తొలుత హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, హెల్త్ వర్కర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పోలీసులు, సాయుధ బలగాలు, హోమ్ గార్డులు, సివిల్ డిఫెన్స్, ప్రకృతి వైపరీత్యాల బలగాలు, ఇందులో పనిచేసే వలంటీర్లు, మున్సిపల్ వర్కర్లు, 50 ఏళ్లకు పైనున్న వయస్సు గల వారికి కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాల్సి ఉంటుందని ఎన్ఈజీవీఏసీ కమిటీ సూచించిందని రాజేష్ భూషణ్ తెలిపారు. మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేయడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచడానికి అవసరమైన శీతల గిడ్డంగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

2.39 లక్షల వ్యాక్సినేటర్లు..
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే.. వాటిని పేషెంట్లకు ఇంజెక్ట్ చేయడానికి అవసరమైన మానవ వనరులు ఉన్నాయని రాజేష్ భూషణ్ అన్నారు. 2.39 లక్షల మంది ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్-ఏఎన్ఎంలు దేశవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. వారిలో 1.54 లక్షల మంది ఏఎన్ఎంలను మాత్రమే వ్యాక్సినేషన్ కోసం వినియోగించుకోవడానికి వీలుందని అన్నారు. రోజువారీ హెల్త్ కార్యక్రమాల కోసం మిగిలిన వారిని కేటాయించాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications