ఆడదేనా? ప్రియుడితో కలిసి భర్తని చంపి.. చెట్టుకు శవాన్ని వేలాడదీసి.. ఆత్మహత్య అనేసింది
తన వివాహేతర సంబంధానికి అభ్యంతరం చెప్పాడన్న కోపంతో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు భర్త మృతదేహాన్ని ఓ చెట్టుకు వేలాడదీసింది.
లూథియానా: తన వివాహేతర సంబంధానికి భర్త అభ్యంతరం చెప్పాడన్న కోపంతో ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకుందామె. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు భర్త మృతదేహాన్ని ఓ చెట్టుకు వేలాడదీసింది. అందరూ తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుకుంటారనుకుంది. కానీ చివరికి బయటపడిపోయింది.
ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని భైని డరేరా గ్రామంలో జరిగింది. బాధితుడు జగ్ పాల్ సింగ్ వ్యవసాయం, మద్యం వ్యాపారం చేస్తుంటాడు.
జగ్ పాల్, హర్జీత్ కౌర్ లకు పెళ్లయి 14 ఏళ్లు అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

దేవీందర్ సింగ్ బిందా వీళ్ల జీవితంలోకి ప్రవేశించేంత వరకు అంతా సవ్యంగానే సాగింది. నాలుగు నెలల క్రితం వ్యాపారం పేరుతో దేవీందర్ వీరి ఇంటికి రావడం మొదలుపెట్టాడు.
అతడి కన్ను హర్జీత్ కౌర్ పై పడింది.
కొంతకాలానికి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ విషయం జగ్ పాల్ కు తెలిసింది. దీంతో భార్యభర్తలిరువురి నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి.
రెండ్రోజుల క్రితం రాత్రి సమయంలో దేవీందర్ మరో ముగ్గురు వ్యక్తలతో కలిసి జగ్ పాల్ ఇంటికి వచ్చాడు. పిల్లలిద్దరూ పక్క గదిలో పడుకుని ఉన్నారు. హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ కలిసి జగ్ పాల్ పీక పసికి చంపేశారు.
అతడి మృతదేహాన్ని మోసుకుని వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు వేలాడదీసి, అది ఆత్మహత్య అనుకునేలా చిత్రించారు. అయితే జగ్ పాల్ తమ్ముడు గుర్ ప్రీత్ సింగ్ ఈ కట్టుకథను నమ్మలేదు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి తన అనుమానాలు వ్యక్తం చేశాడు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తమదైన శైలిలో విచారణ నిర్వహించడంతో మొత్తం కథంతా బయటపడింది. దీంతో పోలీసులు హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ బిందా ఇద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications