సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..దానికి బాబ్రీ పేరు పెడతాం?
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన సున్నీ వక్ఫ్ బోర్డు తన మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్ర సున్నీ వక్ఫ్ బోర్డు మొదట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేస్తామని ప్రకటించింది. సాయంత్రానికి తన మనసును మార్చుకుంది. తీర్పును తాము స్వాగతిస్తున్నామని వెల్లడించింది. రివ్యూ పిటీషన్ వేయదలచుకోలేదని తేల్చి చెప్పింది.

మొదట్లో వ్యతిరేకించినా..
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వినిపించిన తీర్పు సంతృప్తికరంగా లేదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వెల్లడించిన విషయం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించడానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల స్థలానికి ఎలాంటి విలువ లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తమకు గౌరవం ఉన్నప్పటికీ పున:సమీక్షకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మొదట్లో ఆయన తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. సాయంత్రానికి సున్నీ వక్ఫ్ బోర్డు పెద్దలు తమ మనసును మార్చుకున్నారు.

అజ్మీర్ దర్గా, ముస్లిం పర్సనల్ లా బోర్డు నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకేనా?
తీర్పు వెలువడిన అనంతరం న్యూఢిల్లీలో సున్నీ వక్ఫ్ బోర్డు పెద్దలు సమావేశమయ్యారు. వారి తరఫున సుప్రీంకోర్టులో కేసును వాదించిన జఫర్యాబ్ జిలానీ సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. తీర్పు వెలువడిన తరువాతి పరిస్థితులపై అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి గానీ, ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు రాలేదు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రధాన మౌల్వీ సైతం తీర్పును స్వాగతించడం వారిని సున్నీ వక్ఫ్ బోర్డు పెద్దలను పునరాలోచనలో పడేసిందని అంటున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం పెద్దగా వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఒంటరి పోరాటం చేయలేమనే అభిప్రాయం వారిలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

అయిదు ఎకరాలను స్వీకరించడమే మేలు..
ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించడమే మేలనే అభిప్రాయం మెజారిటీ సభ్యుల్లో వ్యక్తమైనట్లు సమాచారం. అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా అయిదు ఎకరాల స్థలాన్ని తమకు కేటాయించాలని సుప్రీంకోర్టు చేసిన ఆదేశించిందని, ఆ స్థలాన్ని రాబట్టుకుని అక్కడే మసీదును పునర్నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు సభ్యులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలని వారు నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయిదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించి.. దానికి బాబ్రీ పేరు పెట్టాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.

తీర్పును స్వాగతించిన అయోధ్య జామా మసీదు షాహీ ఇమామ్
సుప్రీంకోర్టు తీర్పును అయోధ్యలోని ప్రముఖ జామా మసీదు షాహీ ఇమామ్ సైతం స్వాగతించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ముస్లిం కూడా స్వాగతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలయం ఉన్న ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు లభించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని సూచించారు. బాబ్రీ మసీదు భూమికి ప్రత్యామ్నాయంగా అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దాన్ని స్వీకరించి, మసీదును నిర్మించుకోవాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications