వామ్మో.. కేరళలో జికా వైరస్.. తొలి కేసు నమోదు
అసలే కరోనా కలవరపెడుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లు.. ఫంగస్‌లతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. పరస్సాలాకు చెందిన 24 ఏళ్ల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ సోకిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. గత నెలలో బాధితురాలు జ్వరం, తలనొప్పితో పాటు , చర్మంపై ఎర్రటి గుర్తులు వంటి లక్షణాలతో హాస్పిటల్‌కి ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని..ప్రాధమిక పరీక్షలలో ఆమెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
జికా సోకి చికిత్స పొందుతున్న బాధితురాలు జూన్ 7న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య అధికారులు చెప్పారు. బిడ్డలో కూడా వైరస్ లక్షణాలు లేవని తెలిపారు. మరోవైపు, తిరువనంతపురం జిల్లా నుంచి 19 శాంపిల్స్ ను టెస్ట్ లు చేయగా వాటిల్లో 13 పాజిటివ్ కేసులని అనుమానిస్తున్నారు. దీంతో వీరందరి శాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపామని తెలిపారు.

జికా వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధిని నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టింది. సంబంధిత అధికారులు, నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నివారణ చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేశారు. జికా వైరస్ అనేది దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధి. పగటిపూట సంచరించే ఏడెస్ అనే దోమల నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
జికా వైరస్ యొక్క లక్షణాలు చికున్‌గున్యా మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ జికా వైరస్ సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయదు. అయితే వైరస్ గర్భిణీ స్త్రీలకు సోకితే, ఆ ప్రభావం పుట్టే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదట 1947లో ఉగాండా అడవుల్లోని కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ ఈ వైరస్ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో జికా కేసులు వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications