నేపాల్- భారత్ సరిహద్దుల్లో భూకంపం: 30 లక్షల క్యూసెక్కుల నీటి నిల్వలు తెగే ప్రమాదం
నేపాల్‌ను ప్రకృతి వైపరీత్యాలు వణికిస్తోన్నాయి. ఇప్పటికే భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైన ఆ దేశంలో తాజాగా సంభవించిన భూకంపం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టినట్టయింది. ఏ క్షణంలో ఏ ఉత్పాతం విరుచుకుపడుతుందోననే భయాందోళనలు అలముకున్నాయి. ఈ భూకంపం వల్ల తక్షణ నష్టం ఏదీ సంభవించనప్పటికీ.. భోటేకోశి నదిపై కొత్తగా ఏర్పడిన కృత్రిమ సరస్సు ఎప్పుడైనా పగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 గా రికార్డయింది. ఇదే తేలికపాటి ప్రకంపనలే. అయినప్పటికీ.. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి. గురువారం రాత్రి 9:18 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భారత్- నేపాల్ సరిహద్దుల్లో 27.483 అక్షాంశం, 88.008 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. సిక్కింలోని యుక్సామ్ పరిధిలో ఉంటుందీ ప్రాంతం.

ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు సెస్మాలజీసెంటర్ వివరించింది. చైనా సరిహద్దు ప్రాంతంలో విరిగిపడిన కొండచరియల కారణంగా ఇప్పటికే భోటేకోశి నది సహజ ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల రసువా జిల్లా పరిధిలోని నది జన్మస్థలం వద్ద నిమిష నిమిషానికి నీరు చేరి భారీ కృత్రిమ సరస్సులా రూపాంతరం చెందింది.
గురువారం ఉదయం నూతనంగా ఏర్పడిన సరస్సులో సుమారు 20 నుంచి 30 లక్షల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీరు పేరుకుపోయింది. ఇక్కడ ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు అదనంగా వచ్చి చేరే అవకాశాలను కొట్టిపారేయట్లేదు చైనా. ఇంత భారీ మొత్తంలో నీరు చేరిన ఈ తాత్కాలిక సరస్సు భూ ప్రకంపనల వల్ల గనుక ఒక్కసారిగా తెగితే, ఊహించని రీతిలో భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తోంది.
చైనా ఇచ్చిన సమాచారంతో నేపాల్ ప్రభుత్వ ప్రభుత్వం.. భోటేకోశి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది. నదీ తీర ప్రాంతాలకు దూరంగా, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానికులను ఆదేశించింది. గురువారం సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 392 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,500 మందికి పైగా ఆచూకీ తెలియరావట్లేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ భూకంప ప్రకంపనలు రావడం, నది ప్రవాహం ఆగిపోవడం వంటి పరిణామాలు సహాయక బృందాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications