తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. ఇక రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 14న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేయనున్నారు అర్చకులు. 15న ధ్వజారోహణంతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ఆరంభమౌతాయి. ఈ నేపథ్యంలో అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడం, వాహన సేవలను తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నారు.
తాజాగా.. బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన డెప్యుటేషన్ అధికారులు, సిబ్బందితో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సమావేశం అయ్యారు. తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన ఉండాలని వెంకయ్య చౌదరి అన్నారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని, గత అనుభవాన్ని ఉపయోగించుకుని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ టీటీడీ నిర్దేశించిన దుస్తులు ధరించాలని, డ్రెస్ కోడ్ ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సీనియర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో చెప్పారు. భక్తుల పట్ల మర్యాదగా, సేవాభావంతో వ్యవహరించి శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కోరారు.
సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చరిత్రలో నిలిచేలా సమష్టి కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు.














Click it and Unblock the Notifications
