Monsoon 2026: ముగిసిన వర్షాకాలం- 13 శాతం లోటు- 2001 నుంచి నాలుగో అత్యల్పం..!
ఈ ఏడాది వర్షాకాలం (Monsoon 2026) అధికారికంగా ముగిసిపోయింది. జూన్ లో మొదలయ్యే రుతుపవనాల సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఇందులో భాగంగా జూన్ తో మొదలయ్యే వర్షాలు ఆ తర్వాత ఊపందుకుని, సెప్టెంబర్ నాటికి పూర్తి వర్షపాతం అందించడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో దేశమంతా వర్షపాత లోటే. తాజాగా కురిసిన వర్షాలతో పరిస్ధితి కాస్త మెరుగుపడినా, అంతిమంగా 13 శాతం వర్షాల లోటుతో ఈసారి సీజన్ ముగిసింది. దీంతో ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత బలహీనమైన వర్షపాత సీజన్లలో ఒకటిగా ఇది నిలిచింది.
ఈ ఏడాది 13 శాతం వర్షపాత లోటు నమోదు కావడంతో ఈ సీజన్.. 2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతం నమోదైన సీజన్ గా రికార్డుల్లో నిలిచింది. ఈసారి జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో కురవాల్సిన సాధారణ రుతుపవన వర్షపాతంలో సుమారు 87 శాతం మాత్రమే పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల, నెలల వారీగా వర్షపాతంలో అసమానతలు ఎలాగో ఉన్నాయి. 1971-2020 కాలం ఆధారంగా లెక్కించిన ఈ సీజన్ దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ. అని వాతావరణ విభాగం తెలిపింది. అయితే ఈ బలహీనమైన రుతుపవనాల పరిస్థితి పూర్తిగా ఊహించనిదేమీ కాదు. వర్షాలు ప్రారంభం కావడానికి నెలల ముందే, ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వర్షపాత లోటు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఊహించినట్లుగానే ఈ సీజన్ లో వర్షపాతం ప్రతీ వారం భారీగా మారుతూ వచ్చింది. జూలై 8తో ముగిసిన వారంలో 45.4% అధిక వర్షపాతం నమోదైనా, తర్వాతి వారంలోనే 51.1 శాతం లోటు కనిపించిందని ఐఎండీ తెలిపింది. జూలై చివరిలో, ఆగస్టు ప్రారంభంలో స్వల్పంగా మెరుగుపడినా ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంది. సెప్టెంబర్ 9తో ముగిసిన వారంలో 36.3 శాతం లోటు నమోదైంది. సీజన్ చివరి వారంలో పరిస్థితి మళ్లీ ఒక్కసారిగా మారి, సాధారణం కంటే 49శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో లోటు కాస్త భర్తీ అయింది. ఈ హెచ్చు తగ్గుల వల్ల దేశంలో రైతులు సాధారణ స్దాయిలో పంటలు వేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ధరలు ఇప్పటికే పెరుగుతూ పోతున్నాయి.














Click it and Unblock the Notifications
