ఆకాశాన్నంటిన గాడిదల ధరలు.. ఊపందుకున్న కొత్త వ్యాపారం!
చైనాకు గాడిదల ఎగుమతుల కారణంగా పాకిస్తాన్‌లో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో రూ.75,000 వరకు లభించే గాడిద ధర ఇప్పుడు రూ.లక్ష దాటిపోయింది. దీని ప్రభావం పాకిస్తాన్‌లోని పేద ప్రజలపై తీవ్రంగా పడుతోంది. వివిధ పనుల కోసం గాడిదలపై ఆధారపడే పేదలు.. ఇప్పుడు కొత్త గాడిదలను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
పాకిస్తాన్ దేశంలో గాడిదల ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది కాలంలో వీటి ధరలు 25 శాతానికి పైగా ఎగబాకాయి. పలు అవసరాల కోసం గాడిదలను వాడుకునే సామాన్య, పేద ప్రజలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. చర్మం, మాంసం కోసం గాడిదలను చైనాకు ఎగుమతి చేయడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రతి ఏటా పెద్ద ఎత్తున గాడిదలను చైనాకు ఎగుమతి చేస్తుండటంతో స్థానిక వ్యాపారులు కూడా ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో గాడిదల చోరీలు కూడా పెరిగనట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో గాడిదల ధరలు ఇలా..
ఏడాది క్రితం పాకిస్తాన్ లో ఎక్కువ శక్తిమంతమైన మగ గాడిద ధర రూ.75,000 ఉండగా.. ఆడి గాడిద ధర సుమారు రూ.44,000 వద్ద ఉండేది. ప్రస్తుతం మంచి మగ గాడిద ధర రూ.లక్ష దాటింది. ఆడ గాడిద ధర కూడా రూ.70,000 నుంచి రూ.75,000 మధ్యకు చేరింది. ఈ స్థాయిలో ధరలు పెరగడంతో పేదలు వాటిని కొనే స్థోమత కోల్పోయి తమ జీవనోపాధిపై దెబ్బ పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలను కట్టడి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చైనాకు ఎగుమతి.. ఎజియావో మందు కోసం
బలూచిస్తాన్‌లోని తుర్బత్ లో రూ.4000ల నుంచి రూ.5000 మధ్య క1నుగోలు చేసిన గాడిదలు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అమ్ముడవుతున్నాయి. దళారులు వీటిని చైనాకు ఎగుమతి చేసే వ్యాపారులకు రూ.15,000కు పైగా ధరకు విక్రయిస్తున్నారు. ఈ జంతువులను నేరుగా చైనాకు పంపిస్తున్నారు. అక్కడ వాటి చర్మాన్ని ఉడికంచి జెలటిన్ తీసి ఎజియావో అనే మందును తయారు చేస్తున్నారు. రక్త ప్రసరణ మెరుగుపడుతుందని.. రక్తహీనతకు చికిత్స అందిస్తుందని పేర్కొంటూ ఈ మందును విక్రయిస్తున్నారు.
పాకిస్తాన్‌లో గాడిదల వినియోగం
పాకిస్తాన్‌లో గాడిదలను అనేక పనులకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సరుకుల రవాణో కోసం వీటిని ఎక్కువగా వాడుతారు. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం పాకిస్తాన్‌లో గాడిదల సంఖ్య 60 లక్షలకు (6 మిలియన్) పైగా ఉంది. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో పంటలు, పశుగ్రాసం, కట్టెలు, ఇతర సామగ్రిని తరలించడానికి ఇప్పటికీ గాడిదలనే వినియోగిస్తున్నారు. పలు నగరాల్లోని ఇరుకైన సందుల్లో సరకుల రవాణాకు కూడా ఇవే ఆధారంగా నిలుస్తున్నాయి.













Click it and Unblock the Notifications
