విషాదంగా మారిన భార్య ప్రభుత్వ ఉద్యోగ సంతోషం.. 13 మంది దుర్మరణం!
బీహార్‌లోని నలంద నుంచి ఝార్ఖండ్‌లోని రజ్రప్ప ఆలయానికి పూజ కోసం వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఘోర రోడ్డు ప్రమాదం కబళించింది. భార్య టీచర్‌గా ఎంపికైన ఆనందంలో బయలుదేరిన వివేకానంద కుటుంబాన్ని విధి వంచించింది. రామ్‌గఢ్‌లో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన గుర్తుతెలియని వాహనాన్ని స్కార్పియో బలంగా ఢీకొట్టడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
బీహార్‌లో ఉపాధ్యాయినిగా ఎంపికైన సంతోషం ఆ కుటుంబానికి తీరని విషాదంగా మారింది. కొత్త ఉద్యోగం వచ్చిందన్న ఆనందోత్సాహాలు వెల్లివిరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు రోదనలు మిన్నంటాయి. భార్యకు ఉద్యోగం వచ్చిందనే సంతోషంలో మా చిన్నమస్తీక ఆలయానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో జరిగిన ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులతో పాటు మొత్తం 13 మంది మృతి చెందగా.. ఒకరు విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

జాతీయ రహదారి-33పై ఘోర ప్రమాదం
ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా జాతీయ రహదారి-33 రాంచీ-పాట్నా హైవేపై కుజు ఓపీ పరిధిలోని పైంకీ సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నలంద జిల్లా బేన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాంఘరో గ్రామానికి చెందిన వివేకానంద తన భార్య అమృతా కుమారి, ముగ్గురు పిల్లలు, తల్లితో కలిసి రామ్‌గఢ్‌లోని రజ్రప్పలో ఉన్న మా చిన్నమస్తీక ఆలయానికి బయలుదేరారు. వివేకానంద మా సరస్వతీ విద్యా మందిర్ నిర్వాహకుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల బీహార్‌లో అమృతా కుమారికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందంలోనే ఆలయంలో పూజలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బంధువులు కూడా పాల్గొన్నారు. ఆనందంగా మొదలైన ప్రయాణం ఇంతటి ఘోర విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు.
స్కార్పియోలో 14 మంది.. నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టి..
వివేకానందతో పాటు భార్య అమృతా కుమారి, కుమారులు శుభమ్ కుమార్, అమన్ కుమార్, కుమార్తె సోనాలీ కుమారి, తల్లి ప్రమీలా దేవి ప్రయాణిస్తున్నారు. వీరితో పాటు బంధువులు ముకేశ్ కుమార్, కిరణ్ కుమార్, కరణ్ కుమార్, వైష్ణవీ కుమారి, సింటూ కుమార్, రాజేశ్ కుమార్ కూడా కారులో ఉన్నారు. డ్రైవర్ నందన్, చందన్ కుష్వాహా కూడా వాహనంలో ఉన్నారు. వీరంతా తెల్లని స్కార్పియో వాహనంలో బీహార్ నుంచి రామ్‌గఢ్‌లోని రజ్రప్ప ఆలయానికి వెళ్తున్నారు. జాతీయ రహదారి-33పై కుజు ఓపీ పరిధిలోని పైంకీ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గుర్తుతెలియని వాహనాన్ని స్కార్పియో వేగంగా ఢీకొట్టింది. ధాటికి స్కార్పియో నుజ్జునుజ్జయింది. ప్రమాదంతో ఘటనాస్థలిలో ఆర్తనాదాలు, గందరగోళం నెలకొన్నాయి. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
13 మంది మృతి.. ఒకరి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న కుజు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు, మృతదేహాలను రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 13 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన చందన్ కుష్వాహాకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి సహా 13 మంది మృతి చెందడంతో ఇరు రాష్ట్రాల్లోని బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొత్త ఉద్యోగ ఆనందంలో ఆలయానికి వెళ్లిన కుటుంబంలో ఒకేసారి పలువురు మరణించడంతో నలందలోని జాంఘరో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న రామ్‌గఢ్ డీసీ రితురాజ్, ఎస్పీ ముకేశ్ కుమార్ లునాయత్ తదితర అధికారులు ఘటనాస్థలిని, సదర్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.














Click it and Unblock the Notifications
