Explainer: డీలిమిటేషన్ కమిషన్ లో సభ్యులెవరు ? డెడ్ లైన్ ఎంత? కేంద్రం లెక్క ఇదే.!
కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టి 2/3 వంతు మెజార్టీతో నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల్ని నిర్ణయించడంతో పాటు విభజన కూడా పూర్తి చేస్తుంది. దీంతో డీలిమిటేషన్ బిల్లుతో పాటు కమిషన్ కూడా ఈ ప్రక్రియలో చాలా కీలకం.
ఇంతకీ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (Delimitation Commission) ఎలా ఉంటుందనే ప్రశ్నకు కేంద్రం వద్ద ఇప్పటికే సమాధానం సిద్దంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ కమిషన్ కు ఛైర్మన్ గా పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తారు. అలాగే ఆయన కింద పనిచేయడానికి 12 మంది సభ్యుల్ని కూడా కేంద్రమే ఎంపిక చేస్తుంది. ఈ సభ్యుల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) లేదా ఒక ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, 5 మంది ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కమిషన్ లో విపక్షాలకు కూడా చోటివ్వాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది.

ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల విభజనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఈ కమిషన్ తీసుకునే నిర్ణయాలకు అంతర్గతంగా ఓటింగ్ చాలా అరుదుగా అవసరం అవుతుంది. ఈ కమిషన్ తన తుది నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి దాని స్వంత ప్రక్రియ ఉంటుంది. దీని సంక్లిష్టత దృష్ట్యా, ఈ ప్రక్రియకు రెండు నుంచి రెండున్నరేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ బిల్లుల్ని డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదించి, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్ర పడతాయని అనుకున్నా.. ఆ తర్వాత నుంచి కనీసం రెండేళ్లు అంటే 2029 జనవరి నాటికి దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తుంది.














Click it and Unblock the Notifications
