ఇక చౌకగా ఈవీ కార్లు! బ్యాటరీలపై సుజుకీ సంచలన ప్రకటన.. 2029 టార్గెట్!
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరాపై చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలపై ఆధారపడకుండా లిథియం ఐరన్ ఫాస్పేట్( LFP) బ్యాటరీల ఉత్పత్తిని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 2029 అక్టోబర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీయే అత్యంత ఖరీగైన, కీలకమైన భాగం. ఓ ఎలక్ట్రిక్ కారు ఖర్చులో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు బ్యాటరీకే వెళ్తుంది. బ్యాటరీ తయారీ వ్యయం పెరిగితే కారు ధరలను అదుపులో ఉంచడం కష్టం. ఈ పరిస్థితుల్లో లిథియంతో పాటు నికెల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి ఖరీదైన ఖనిజాలపై ఆధారపడని బ్యాటరీలను రూపొందించేందుకు సుజుకీ ప్రణాళిక సిద్ధం చేసింది.

జపాన్‌లోనే ఉత్పత్తి.. దిగుమతుల భారం తగ్గింపు
జపాన్‌లోనే ఎల్ఎఫ్‌పీ బ్యాటరీల తయారీని ప్రారంభించాలని సుజుకీ నిర్ణయించింది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ సరఫరా మెరుగుపడటంతో పాటు ఇతర దేశాల నుంచి ముడిసరుకు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. భవిష్యత్తులో మారుతి సుజుకీ తీసుకురాబోయే ఎలక్ట్రిక్ కార్లలోనూ ఈ టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉంది. అదే జరిగితే కార్ల ధరలు అందుబాటులో ఉండేందుకు తోడ్పడుతుంది.
ఒకే దేశంపై ఆధారపడకుండా బలమైన బ్యాటరీ సరఫరా చైన్‌ను నిర్మించడమే లక్ష్యమని సుజుకీ గురువారం వెల్లడించింది. బ్యాటరీల తయారీకి అవసరమైన పలు ఖనిజాలను జపాన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎగుమతులపై ఏదైనా దేశం ఆంక్షలు విధిస్తే ఉత్పత్తితో పాటు ధరలపైనా ప్రభావం పడుతుంది. ముడిసరుకు లభ్యతకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుజుకీ అధికారి వెల్లడించారు.
ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్రత్యేకతలివే..
ఎల్ఎఫ్‌పీ బ్యాటరీలలో ప్రధానంగా ఐరన్, ఫాస్పరస్‌ను ఉపయోగిస్తారు. నికెల్, మాంగనీస్, కోబాల్ట్ వంటి ఖనిజాలతో రూపొందించే టెర్నరీ బ్యాటరీలతో పోలిస్తే ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. మరింత సురక్షితమైనవి కూడా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎఫ్‌పీ బ్యాటరీల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ బ్యాటరీలను కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే కాకుండా భవిష్యత్తులో ఇళ్లలో విద్యుత్ నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేలా తీర్చిదిద్దాలని సుజుకీ భావిస్తోంది.
ఎలియీ పవర్‌తో భాగస్వామ్యం.. జపాన్ సర్కార్ సబ్సిడీ
ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు టోక్యోకు చెందిన బ్యాటరీ తయారీ సంస్థ 'ఎలియీ పవర్'తో సుజుకీ చేతులు కలపనుంది. తక్కువ శక్తిని వినియోగిస్తూనే సురక్షితంగా ఉండే బ్యాటరీ టెక్నాలజీపై ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ఇందుకోసం జపాన్‌లోని షిజువోకా ప్రావిన్స్‌లోని కొసాయ్ నగరంలో కొత్త బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం గరిష్టంగా 18.7 బిలియన్ యెన్‌ల(సుమారు 117.3 మిలియన్ డాలర్లు) వరకు సబ్సిడీ అందించనుంది.
తగ్గనున్న టెర్నరీ బ్యాటరీల భారం
ప్రస్తుతం జపాన్‌లోని చాలా వాహన సంస్థలు టెర్నరీ బ్యాటరీలను వాడుతున్నాయి. వీటిలో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉండటంతో ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అయితే వీటికి అవసరమైన ఖనిజాల సరఫరా కొన్ని దేశాలకే పరిమితం కావడంతో వాటిలో చైనా కీలకంగా ఉండటంతో దిగుమతులపై ఆంక్షలు పడితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మారుతి ఈ విటారాలో ఏ బ్యాటరీ ఉంది?
భారత మార్కెట్లో మారుతి సుజుకీకి చెందిన ఏకైక ఎలక్ట్రిక్ కారు మారుతి ఈ విటారాలో ఎల్ఎఫ్‌పీ(లిథియం ఫెరోఫాస్పేట్) బ్యాటరీ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. ఇందులో 49 kwh, 61 kwh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ బ్లేడ్-సెల్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీలను చైనా సంస్థ బీవైడీ నుంచి సేకరిస్తున్నారు. ఇవి గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయని, బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.
తోషిబా, డెన్సో సంస్థలతో కలిసి గుజరాత్‌లోని హంసల్పూర్ ప్లాంట్ లో లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని మారుతి సుజుకీ ఇటీవల ప్రారంభించినప్పటికీ.. అవి ప్రధానంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాల కోసం ఉద్దేశించినవి. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్ల కోసం మారుతి సుజుకీ ఇప్పటికీ బ్యాటరీ దిగుమతులపైనే ఆధారపడుతోంది.














Click it and Unblock the Notifications
