డిసెంబర్‌లో ఆటోమొబైల్ ధమాకా: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్లు!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో డిసెంబర్ 2026 నెల అత్యంత కీలకంగా మారనుంది. ఈ ఏడాది చివరి నెలలో ప్రముఖ వాహన తయారీ సంస్థలైన జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, హోండా కంపెనీలు తమ సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ నుంచి ఫస్ట్ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ మోడల్ 'జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్', హోండా నుంచి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'హోండా జీరో ఆల్ఫా ఈవీ' డిసెంబర్ మొదటి వారంలోనే ప్రదర్శించబడనున్నాయి.
హోండా సంస్థ డిసెంబర్ 2న తన 'జీరో ఆల్ఫా ఈవీ'ని అధికారికంగా పరిచయం చేయనుండగా.. జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ డిసెంబర్ 4న 'కాంబ్యాట్' ప్లగ్-ఇన్-హైబ్రిడ్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్ మోడల్‌ను చైనాకు చెందిన చెరీ కంపెనీ 'జెటూర్ టీ2' ప్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేశారు. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్‌లో తయారీ చేయనున్నారు. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4kwh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ పవర్‌ట్రెయిన్ మొత్తం 360bhp పవర్, 610 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌పై 90 కిలోమీటర్ల పరిధిని ఇస్తుండగా.. ఫుల్ ట్యాంక్ ఇంధనం, పూర్తి బ్యాటరీ ఛార్జింగ్‌తో కలిపి ఏకంగా 1100 కిలోమీటర్ల భారీ రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇంటీరియర్ లో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, లెవెల్-2 ADAS, 540-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
మరోవైపు హోండా నుంచి వస్తున్న 'జీరో ఆల్ఫా ఈవీ' 65kwh నుంచి 75kwh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో సింగిల్-మోటార్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. 2800 మిల్లీమీటర్ల వీల్‌బేస్, ఇల్యూమినేటెడ్ హోండా లోగో, ఆకర్షణీయమైన డిజైన్‌తో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, గ్రీన్ మొబిలిటీ విభాగంలో మంచి ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ప్రీమియం మోడళ్ల రాకతో భారత వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ రంగాలు మరింత పుంజుకోనున్నాయి.













Click it and Unblock the Notifications
