'నాకు మహమ్మద్ అనే పేరు నచ్చలేదు' ఉబర్ డ్రైవర్ ను కొట్టి చంపిన భారతీయుడు.. ఎక్కడంటే..?
అమెరికాలోని మిన్నియాపోలిస్ లో దారుణమైన ఘటన జరిగింది. సోమాలియాకు చెందిన ఓ ఉబర్ డ్రైవర్ పై ఓ భారతీయుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఉబర్ డ్రైవర్ చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ది కౌన్సిల్ ఆన్ అమెరికన్- ఇస్లామిక్ రిలేషన్స్ సంస్థ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. మహమ్మద్ యూసుఫ్(51) అనే ఉబర్ డ్రైవర్ .. హెన్నెపిన్ కౌంటీ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. అతనిపై నవంబర్ 14 న దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. సీటు బెల్టుతో గొంతు బిగించి ఆ తర్వాత కారుతో తొక్కించి తీవ్రంగా గాయపర్చినట్లు వెల్లడించింది.
ఏం జరిగింది..?
అమెరికాలోని మిన్నియాపోలిస్ లో మహమ్మద్ యూసుఫ్ ఉబర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రైడ్ లో భాగంగా సమిత్ అపూర్వ పటేల్ (25) అనే ప్రయాణికుడిని తన కారులో ఎక్కించుకున్నారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత నిందితుడు యూసుఫ్ మెడకు సీటు బెల్టు గట్టిగా బిగించి దాడి చేశాడని, ఆ తర్వాత ఆయన్ను కారు నుంచి బయటకు లాగి అదే కారుతో తొక్కించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఇక ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన యూసుఫ్ తాజాగా తుది శ్వాస విడిచారు.
పేరు నచ్చలేదనే..!
అయితే ఈ ఘటన జరిగే సమయంలో మహమ్మద్ యూసుఫ్ తన సోదరుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సోదరుడు కూడా ఉబర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రయాణికుడు.. యూసుఫ్ ను పేరు అడగ్గా.. మహమ్మద్ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడు ఆ పేరు తనకు నచ్చలేదని వ్యాఖ్యానించినట్లు యూసుఫ్ సోదరుడు పోలీసులకు తెలిపాడు. వీరిద్దరి సంభాషణ తాను ఫోన్ లో విన్నానని తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత యూసుఫ్ సోమాలి భాషలో అరుస్తున్నాడని.. తనను సీటు బెల్టుతో గొంతు బిగించి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే తనను కారుతో తొక్కిస్తున్నాడని కూడా ఆయన కేకలు వేసినట్లు సోదరుడు పేర్కొన్నాడు. ఇక ఈ దాడికి పాల్పడిన 25 ఏళ్ల సమిత్ అపూర్వ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత హత్యాయత్నం, కార్ జాకింగ్ నేరాల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు యూసుఫ్ మరణించడంతో.. నిందితుడిపై సెకండ్-డిగ్రీ ఉద్దేశపూర్వక హత్య కేసుగా అభియోగాలను మారుస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
