స్వాతంత్య్రమే రాకపోతే పాక్ సైన్యం బూట్ల దెబ్బలే: షేక్ హసీనా షాకింగ్ కామెంట్స్!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 1971 విముక్తి పోరాటాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం లభించకపోయి ఉంటే అక్కడి ప్రజలు నేటికీ పాకిస్తాన్ సైన్యం బూట్ల దెబ్బలు తినాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. జైళ్లలో హింస, వైద్యం అందకపోవడం, కస్టడీ మరణాలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. విముక్తి సంగ్రామంలో పాల్గొన్న వారిని ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యందా చేసుకుంటోందని షేక్ హసీనా ఆరోపించారు. జైళ్లలో ఉన్నవారిపై దాడులు చేయడం, చికిత్స అందించకపోవడం, కస్టడీలో మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఆన్‌లైన్ కార్యక్రమం 'దయాముక్తి లైవ్' 98వ ఎపిసోడ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అవామీ లీగ్ సభ్యులు, రాజకీయ హింస బాధిత కుటుంబాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి.
'జైళ్లలో వైద్యం కూడా అందించడం లేదు'
కస్టడీ మరణాలు విడిగా జరుగుతున్న ఘటనలు కావని.. జైళ్లలో పలువురిని తీవ్రంగా హింసించి ఆ తర్వాత ప్రాణాలు తీశారని షేక్ హసీనా ఆరోపించారు. నిర్బంధంలో ఉన్నవారికి కనీసం వైద్యం కూడా ఇవ్వడం లేదని.. కొన్ని సందర్భాల్లో మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలపడం లేదని విమర్శించారు. ఢాకాలోని రాంపురా, బంగ్షాల్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.

దేశంలో ప్రజలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని షేక్ హసీనా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాకపోయి ఉంటే ఎవరికీ ప్రధాని అయ్యే అవకాశమే ఉండేది కాదని.. పాకిస్తాన్ సైన్యం దురాగతాలను భరించాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. 1971 స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న షేక్ హుస్సేన్ అలీ అనే యోధుడిని మైమెన్‌సింగ్ జిల్లాలోని ధుబౌరాలో హత్య చేసి.. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారని ఆరోపించారు. ఆ యోధుల త్యాగం లేకుంటే బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చేది కాదన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ను గుర్తు చేసుకుంటూ.. ఆయన జీవించి ఉంటే స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లలోనే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేదని అన్నారు.
అవామీ లీగ్ లాక్‌డౌన్‌తో పెరిగిన ఉద్రిక్తత
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 29, 30 తేదీలలో రెండు రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో రహదారుల దిగ్బంధనం, నిప్పు పెట్టే ఘటనలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశవ్యాప్తంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ 120 ప్లాటూన్లను మోహరించింది. ఆదివారం అధికార బీఎన్పీ కార్యకర్తలు, అవామీ లీగ్ కు చెందిన వారి మధ్య జరిగిన ఘర్షణలో పార్టీ యువ కార్యకర్త ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు నరైల్ జిల్లాలో అవామీ లీగ్ నేతల ఇళ్లు, దుకాణాలపై బీఎన్పీ వర్గీయులు దాడి చేసి విధ్వంసం సృష్టించారని, నిప్పుపెట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 20 నుంచి 25 ఇళ్లలోని 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని.. పలు దుకాణాలు దెబ్బతిన్నాయని తెలిసింది. హింస, విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాజకీయ హత్యలు, నిప్పుపెట్టే ఘటనలపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని తారిక్ రెహమాన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే యోచనలో షేక్ హసీనా
షేక్ హసీనా కామెంట్ల నేపథ్యంలో ఆమె బంగ్లాదేశ్ కు తిరిగ వెళ్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. బంగ్లాదేశ్ లో విజయ దినోత్సవంగా జరుపుకునే డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆమె ఇటీవల పేర్కొన్నారు. 2024 ఆగస్టు 5 నుంచి షేక్ హసీనా ఇండియాలో ఉంటున్నారు. ఆమె తిరిగి వస్తే అరెస్ట్ చేసి అప్పగింత చర్యలు చేపడతామని బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా ఇండియాను కోరింది. ఈ అభ్యర్థనను నిర్దేశిత న్యాయ ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.














Click it and Unblock the Notifications
